
తెలంగాణలో సార్వత్రిక సమరం ముగిసింది. 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సీట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ప్రజలు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఫలితాలు రావాలంటే మరో 15 రోజులు ఆగాల్సిందే. కాగా, ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇకపై ఓ లెక్క అన్నట్లుగా పార్లమెంట్ ఫలితాల తర్వాత రాజకీయాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే.. ఆ పార్టీవైపు మెజారిటీ నాయకులు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవులే లక్ష్యంగా పలువురు నాయకులు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచే కొందరు నాయకులు కాంగ్రెస్ లో చేరారు. సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేసిన దానం నాగేందర్ సైతం బీఆర్ ఎస్ నుంచి అధికార పార్టీలోకి వచ్చిన వారే. పలువురు మాజీ ఎమ్మెల్యేలు,కీలక నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య ముక్కోణ పోటీ జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఏవైనా రెండు పార్టీల మధ్యే ఆధిపత్య పోరు కొనసాగనున్నందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో గ్రామ, మండల స్థాయి నేతలు తమ రాజకీయ భవిష్యత్ కోసం బలమైన పార్టీని ఎంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నుంచి ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్, బీజేపీల్లో అత్యధిక స్థానాలు దక్కించుకునే పార్టీలోకి మిగిలిన పార్టీ నుంచి వలస పెరిగే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.
ఇదిలాఉండగా ఇటీవలే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. గ్రామ పంచాయతీల పదవీకాలం నాలుగు నెలల క్రితమే పూర్తయింది. వచ్చే నెలలో మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం పూర్తికానుంది. దీంతో కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో గెలుపు అవకాశాలు ఉన్న పార్టీలను ఎంచుకుని ఆయా పార్టీల్లోకి వలస వెళ్లేందుకు గ్రామ, మండలస్థాయి లీడర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించే పార్టీకి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు ఎక్కువగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. దీంతో మూడు పార్టీల లీడర్లు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY