జంట నగరాల్లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల ద్వారా ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి, సిటీ శివార్లలో ఉన్న చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను కూడా రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకుని వచ్చింది. భారీ వ్యయంతో నిర్మించిన చర్లపల్లి టెర్మినల్.. అత్యంత విశాలంగా, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కొలువుదీరింది. సింపుల్ గా చెప్పాలంటే.. ఎయిర్‌పోర్ట్ లుక్‌తో కనిపించే ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రయాణికులకు తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది.
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. హైదరాబాద్‌లో నాల్గో అతి పెద్ద రైల్వే స్టేషన్ అయిన చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను.. మొత్తం రూ. 430 కోట్ల వ్యయంతో నిర్మించారు. అక్కడ మొత్తం 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు, 2 ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో చర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ నిర్మాణం జరిగింది. హైదరాబాద్‌లో వందేళ్ల తర్వాత మరో అతి పెద్ద రైల్వే స్టేషన్…అందరికీ అందుబాటులోకి వచ్చింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధం కావడంతో ఇటు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై భారం తగ్గనుంది. కాకపోతే చర్లపల్లి నుంచి హైదరాబాద్ సిటీలోకి రోడ్ కనెక్టివిటీని పెంచాల్సిన అవసంర ఉంది.
చర్లపల్లి టెర్మినల్ వల్ల 50 వేల మంది నుంచి లక్షమంది ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. చర్లపల్లిలో ఇప్పటికే 25కు పైగా రైళ్లు ఆగుతుండగా.. ఈ టెర్మినల్ అందుబాటులోకి వచ్చాక మరో 30 రైళ్ల దాకా అందుబాటులోకి వస్తాయి. దీంతో ప్రయాణికులు ఈజీగా వారి వారి గమ్య స్థానాలకు చేరే అవకాశం ఉంటుంది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, విశాఖ వైపు వెళ్లే రైళ్లను రైల్వే అధికారులు చర్లపల్లి టెర్మినల్ నుంచి నడపనున్నారు.
ప్రస్తుతం చర్లపల్లిలో గల 9 ప్లాట్‌ఫామ్‌లలో.. రెండింటిని మాత్రం ఎంఎంటీఎస్ ట్రైన్స్ కోసం కేటాయించారు. అలాగే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు, ఏసీ, నాన్ ఏసీ వెయిటింగ్ హాల్స్, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు కూడా వంటివి సిద్ధం చేశారు. ప్రధానిమోదీ వర్చువల్‌గా ఈ చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభిస్తారు. ఇదే సమయంలో చర్లపల్లిలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి కిషన్‌రెడ్డి హాజరవుతారు.