ఈ దేశ రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం, రైతు వ్యతిరేకులతో ‘జై కిసాన్’ నినాదాన్ని పలికించాలి: సీఎం కేసీఆర్

CM KCR Chairs National Farmers Association Leaders Meeting Second Day on August 28 at Pragati Bhavan, KCR Holds 2 Day Meet With Farmer Unions , Telangana CM Conference With National Farmers unions, CM KCR Meet With 26 States Farmer Leaders, Mango News, Mango News Telugu, CM KCR Latest News And Updates, Telangana CM KCR, Telangana CM KCR Farmers Conference, CM KCR News And Live Updates, CM KCR Farmer Conference At Pragathi Bhavan, Telangana CM KCR, TRS Party, Farmers Union Conference

ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి పంథానే దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి అనుసరించడం ద్వారానే గమ్యాన్ని చేరుకోగలమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ వ్యతిరేకులతో నాడు ‘జై తెలంగాణ’ నినాదాన్ని అనిపించినట్టే, నేడు రైతు వ్యతిరేకులతో ‘జై కిసాన్’ నినాదాన్ని పలికించాలన్నారు. ఆ దిశగా దేశంలోని రైతు నేతలంతా ఐక్య సంఘటన కట్టి, ప్రతినబూనాల్సిన అవసరం ఉన్నదని సీఎం అన్నారు. ఈ దేశ రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం అని, రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటదని, వ్యవసాయం బాగుంటేనే సమాజం బాగు పడతదని సీఎం అన్నారు. ఈ దేశంలో రైతు మర్యాదను నిలబెట్టి, ఆత్మ గౌరవం కాపాడేందుకు కలిసి పనిచేద్దామని. జాతీయ రైతు నేతలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం నాడు జాతీయ సంఘాల నేతలతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రెండో రోజు సమావేశం జరిగింది. జాతీయ స్థాయిలో రైతుల ఐక్య వేదిక ఏర్పాటు చేయాలని శనివారం నాటి తీర్మానాన్ని అనుసరించి చర్చ కొనసాగింది. త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి, విధి విధానాలను రూపొందించాలని సమావేశం తీర్మానించింది.

వజ్రోత్సవ భారతంలోనూ, అపరిష్కృత రైతాంగ సమస్యలెన్నో:

దేశంలో దశాబ్దాల కాలం నుంచి రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలకు వజ్రోత్సవ స్వతంత్ర భారతంలో ఇంకా పరిష్కారాలు దొరకకపోవడం దురదృష్ణకరమన్నారు. దేశాన్నేలుతున్న కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక అసంబద్ద విధానాలను తిప్పికొట్టి వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని ఆదివారం నాటి జాతీయ రైతు సంఘాల సమావేశం స్పష్టం చేసింది. దేశ రైతాంగాన్ని గ్రామస్థాయి నుంచి ఐక్యం చేసేందుకు నాయకత్వం వహించాలని సీఎంను సమావేశం ముక్తకంఠంతో కోరుతూ తీర్మానించింది.

వ్యవసాయ రంగ సమస్యలు-పరిష్కారాలపై సుదీర్ఘ చర్చ:

ఈ సందర్భంగా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాల వల్ల భవిష్యత్ దేశీయ వ్యవసాయ రంగం కునారిల్లిపోనున్న ప్రమాదకర పరిస్థితుల్లో ఈ సమస్యలకు కారణాలు, వాటి పరిష్కార మార్గాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన జాతీయ రైతు సంఘాల నేతలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. స్వాతంత్య్ర కాలం నుంచి నేటి వరకూ దేశంలో జరిగిన రైతాంగ పోరాటాలను, అందుకు నాయకత్వం వహించిన నేతలు, వారు అవలంభించిన విధానాలు, పోరాట రూపాలను చర్చించారు. నాటి వ్యవసాయ పరిస్థితులకు, మారిన నేటి పరిస్థితులకు అవలంభించాల్సిన ఉద్యమ కార్యాచరణ విధి విధానాలను, పోరాట రూపాల బ్లూ ప్రింట్ ను తయారు చేసి దేశ రైతాంగాన్ని సంఘటితం చేసే దిశగా చర్యలు ప్రారంభించాలని, అందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేయాలని, సీఎం కేసీఆర్ ను కోరుతూ సమావేశంలో సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

జట్టుకట్టి, పట్టు పడితే, సాధించలేనిది ఏమీ లేదు:

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘వ్యవసాయం ఈ దేశ ప్రజల జీవన విధానమని, వ్యవసాయాన్ని ఈ దేశం నుంచి ఎవరూ వేరు చేయలేరు. రైతన్నలో శక్తి గొప్ప శక్తి దాగి ఉంటది. దాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉన్నది. మన సమస్యలకు పరిష్కారాన్ని మనమే అన్వేషించాలి. జట్టు కట్టి పట్టు పడితే సాధించలేనిది ఏమీ లేదని నేను స్వయంగా ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం, లక్ష్యాన్ని సాధించి రుజువు చేసింది. నాకంటే ముందు తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. కాని, నిర్దిష్ట పరిస్థితులకు అనుసరించాల్సిన నిర్దిష్ట కార్యాచరణ కొరవడటంతో ఆనాడు లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు పలు రంగాలకు చెందిన మేధావులతో కొన్ని వేల గంటల మేధో మధనం చేసిన. తెలంగాణ పోరాటాలు విఫలం చెందడానికి కారణాలను అన్వేషించిన. ఆఖరి పోరాటం ఆగం కాకూడదనే దృఢ సంకల్పంతో, మొహమాటాలకు, బేషజాలకు తావు లేకుండా అటు రాజకీయ పంథాకు, ఇటు ఉద్యమ పంథాను సమన్వయం చేసుకుంటూ జమిలి పోరాటాలతో ముందుకు సాగాలనే తుది నిర్ణయం తీసుకోవడం ద్వారా గమ్యాన్ని ముద్దాడినం’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

శాంతియుత పంథాలో పార్లమెంటరీ పోరాటం చేద్దాం:

‘‘ఆనాడు తెలంగాణ ప్రజలను ఇంటింటికీ ఒక యువకుడిని పంపమని అడిగిన. ఓటు వేయడం ద్వారా తమ శక్తిని చాటే పార్లమెంటరీ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన. వివిధ ఉద్యమ రూపాల ద్వారా ప్రజలను చైతన్య పరిచినం. ఓటు అనే ఆయుధాన్ని ప్రజా ఆకాంక్షలకు ప్రతిరూపంగా మార్చి లక్ష్యాన్ని చేరుకోగలిగాం. రాజకీయాలతో అయితదా? అని నన్ను అడిగిండ్రు. కానీ, వారి అనుమానాలను పటా పంచలు చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిజం చేసి చూపించిన’’ అని సీఎం అన్నారు. రాజకీయ నిర్ణయాల ద్వారానే ప్రజా జీవితాలు ప్రభావితమవుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకు అసెంబ్లీలు, పార్లమెంటులే వేదికలన్నారు. కేవలం ఉద్యమాలు, ఆందోళనల పేరుతో చట్టసభలకు దూరంగా జరిగే పోరాటాలు సఫలీకృతం అయిన చరిత్ర స్వతంత్ర భారతంలో కనిపించదన్నారు. రాజకీయాలు చేయడం అంటే నామోషీ అని భావించడం తప్పు అని సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతులు చట్టసభల్లోకి ఎందుకు వెళ్లకూడదు? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

రాజకీయాల్లో రైతు నేతలు భాగస్వాములు కావాలి:

రాజకీయాలంటే అయోమయం అవసరం లేదు. మొహమాటాల నుంచి రైతు నేతలు బయటపడి రాజకీయాలనే పవిత్ర యజ్ఞంలో భాగస్వాములై, దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి పాటుపడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆయా సందర్భాలను బట్టి, నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణను అనుసరిస్తూ, అవసరమైన చోట ఉద్యమ పంథాను కూడా కొనసాగిస్తూ సాగే, ప్రజాస్వామిక పార్లమెంటరీ పంథా ద్వారా మాత్రమే ప్రజాస్వామిక దేశాల్లో ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందన్నారు. అందుకు తెలంగాణ రాష్ట్ర సాధనే నిదర్శనమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ‘‘ఎక్కడ ఆందోళన అవసరమైతదో అక్కడ ఆందోళన చేద్దాం-ఎక్కడ రాజకీయాలు అవసరమైతయో అక్కడ రాజకీయాలు చేద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. మన శక్తిని మనం గుర్తించడంలో వెనుకబడి ఉన్నాం. రాజకీయాల్లో ఉండటం అపవిత్రం అనుకోవడం సరికాదు.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

జాతీయస్థాయిలో ఐక్య సంఘటనను నిర్మిద్దాం:

‘‘ఈ సమావేశంలో పాల్గొన్న రైతు సంఘాల నాయకులందరూ మీ మీ ప్రాంతాలకు చేరుకొని, మనం తీసుకున్న నిర్ణయాలను, అంశాలను మీ సంఘాల నేతలు, రైతులతో చర్చించండి. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోండి. మరికొద్ది రోజుల్లో మరోసారి సమావేశమవుదాం. జాతీయస్థాయిలో ఐక్య సంఘటనను నిర్మిద్దాం. దేశవ్యాప్తంగా గ్రామగ్రామానికి చేరుకునేలా రైతుల ఐక్యత చాటుదాం. దేశం నలుమూలల నుంచి రైతుల డిమాండ్లను విందాం. జాతీయస్థాయిలో వ్యవసాయ రంగానికి చెందిన శాస్త్రవేత్తలను, ఆర్థికవేత్తలను, పలు రంగాలకు చెందిన మేధావులను, జర్నలిస్టులను పిలిచి, వారందరితో లోతైన చర్చలు, విశ్లేషణలు చేద్దాం. ఆ సమావేశంలో దేశ రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని సమస్యల నుంచి కాపాడుకునేందుకు అనుసరించాల్సిన విధి విధానాలను, కార్యాచరణ బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసుకుందాం. రాష్ట్ర, జిల్లా, తాలూకా, గ్రామస్థాయిలో ఫెడరల్ స్ఫూర్తితో సంఘ నిర్మాణాలు చేద్దాం. రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిద్దాం. తెలంగాణ సాధన కోసం సాగిన భావజాల వ్యాప్తిలాగా, రైతుల సమస్యల పరిష్కార సాధన కోసం కావాల్సిన భావజాలాన్ని దేశంలోని అన్ని గ్రామాల్లో వ్యాప్తి చేద్దాం” అని సీఎం కేసీఆర్ అన్నారు.

‘అవ్వల్ దర్జా కిసాన్’ లను తయారు చేద్దాం:

“నేను స్వయానా ఒక రైతును. రైతు కష్టాలు నాకు తెలుసు. వాటిని పరిష్కరించం ఎట్లనో కూడా తెలుసు. ఢిల్లీ, హైదరాబాద్ సహా, ఉత్తర, దక్షిణ భారత దేశాలను అనుసంధానించేందుకు రైతు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుందాం. ఒక సామాన్య రైతు కూడా దేశ ప్రధానితో ధీటుగా చర్చించే విధంగా వారిని తీర్చిదిద్దుదాం. రైతాంగం కోసం ఏకరీతి ఎజెండాతో ఒకేసారి పోరాటాన్ని ప్రారంభిద్దాం. దేశ రైతును ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరిగే ‘అవ్వల్ దర్జా కిసాన్’ గా తయారు చేద్దాం’’ అని సీఎం కేసీఆర్ రైతు సంఘాల నేతలకు పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్ అనుసరించిన మార్గంలోనే నడుద్దాం:

ఈ సందర్భంగా పంజాబ్, ఉత్తర ప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన సీనియర్ రైతులు మాట్లాడుతూ ‘‘మనం ఇన్నాళ్లూ రైతు సమస్యల పరిష్కారానికి కేవలం ఆందోళనలు, ఉద్యమాలే శరణ్యం అనుకొని మన జీవితాలను మార్చే రాజకీయాలను విస్మరించాం. ఇకనుంచి సీఎం కేసీఆర్ అనుసరించిన మార్గంలోనే కలిసి నడుద్దాం. ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, దేశ రైతాంగ సమస్యలకు పరిష్కారాలను సాధించుకుందాం’’ అని దేశ రైతాంగానికి పిలుపునిచ్చారు.

దేశ రైతు ఒక్క ఎకరం భూమి కూడా కోల్పోవద్దు:

నూతన వ్యవసాయ చట్టాల పేరుతో, కరంటు మోటార్లకు మీటర్లు పెట్టి, రవాణా చార్జీలను పెంచి, ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తూ, రైతు పంటల ఎగుమతులు, దిగుమతుల్లో అసంబద్ధ విధానాలను అవలంభిస్తూ, కేంద్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నదని సమావేశం అభిప్రాయపడింది. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి, సన్నకారు రైతుల నోళ్లు కొట్టి, కార్పొరేట్ గద్దలకు దేశీ వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పేందుకు కుట్ర జరుగుతున్నదని, దీన్ని తిప్పికొట్టాలని, ఒక్క ఎకరం కూడా దేశ రైతు తన భూమిని కోల్పోకుండా కాపాడుకుంటాం.. అని సమావేశం తీర్మానం చేసింది. రైతు పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని నమ్మబలుకుతూ.. మండీలను ఖతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టి, దేశ ప్రధాని నరేంద్ర మోడీతో స్వయంగా క్షమాపణలు చెప్పించిన ఘనత భారత దేశ రైతాంగానికి చెందుతుందని పంజాబ్ కు చెందిన సీనియర్ రైతులు ఈ సందర్భంగా అభిప్రాయ పడ్డారు.

సేవ్ ఇండియన్ ఫార్మర్స్, వాస్తవిక భారత నిర్మాణం సీఎం కేసీఆర్ తోనే జరగాలి:

ప్రధాని మోదీ రైతు వ్యతిరేక చర్యలు దేశ రైతాంగానికి ప్రమాదకరంగా మారాయని, అటువంటి ప్రమాదం మల్లోసారి రాకుండా చూడాల్సిన గురుతర బాధ్యత దేశ రైతాంగం మీదనే ఉన్నదని తమిళనాడుకు చెందిన రైతులు స్పష్టం చేశారు. దేశం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది. ప్లీజ్ సేవ్ ఇండియన్ ఫార్మర్స్ అంటూ వారు సీఎం కేసీఆర్ ను అభ్యర్థించారు. వాస్తవిక భారత నిర్మాణం కేసీఆర్ వంటి నాయకుల చేతుల మీదుగానే ప్రారంభం కావాలని, ఒకే దేశం-ఒక్కటే రైతు సంఘం అనే నినాదంతో అన్ని రాష్ట్రాల రైతులు ముందుకు సాగితేనే మన సమస్యలు సంపూర్ణంగా పరిష్కారం అవుతాయని, ఈ దిశగా మమ్మల్ని నడిపించాలని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని సమావేశంలో పాల్గొన్న సౌత్ ఇండియన్ ఫార్మర్స్ యూనియన్ నేతలు స్పష్టం చేశారు.

తెలంగాణ రైతు పథకాలు దేశమంతటా అమలు చేయాలి:

దళిత బంధు సహా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు తదితర వ్యవసాయ అభివృద్ధి, రైతాంగ సంక్షేమ కార్యక్రమాలు కేంద్రంలోని పాలకుల్లో భయాన్ని సృష్టిస్తున్నాయని, కానీ వీటిని దేశవ్యాప్తంగా అమలు పరచడం అనేది చిత్తశుద్ధి ఉంటే సాధ్యమయ్యేదేనని వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.

దళితబంధు విప్లవాత్మకం:

సమావేశంలో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన రాఘవేంద్ర కుమార్ అనే దళిత రైతు నిన్న క్షేత్రస్థాయి పర్యటనలో దళిత బంధు పథకం అమలు తీరుతెన్నులను తెలుసుకొని వచ్చి తన అనుభవాల్ని వివరించారు. దళితబంధు పథకం ఒక విప్లవాత్మక పథకమని, అణగారిన దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని, దళితబంధు మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశమే అయినప్పటికీ, కీలక నిర్ణయాధికారం అంతా కేంద్రం చేతుల్లోనే ఉన్నదని సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రంలోని రాజకీయ అధికారంలో దేశ రైతాంగం భాగస్వామ్యం కాకపోతే.. వ్యవసాయాధారిత భారతదేశంలో సంపూర్ణ ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పాటు కానేకాదని సీనియర్ రైతు నేతలు అభిప్రాయపడ్డారు. ఆచార్య వినోబా భావే స్ఫూర్తితో స్వతంత్రదేశంలో ‘‘స్వతంత్ర గ్రామాలను నిర్మిద్దాం అని వారు నినదించారు.

సీఎం కేసీఆర్ దార్శనికతతోనే ప్రశాంతంగా తెలంగాణ:

సీఎం కేసీఆర్ దార్శనికత, కృషి వల్లనే శాంతి ఫరిఢవిల్లుతున్నదని, ఇటీవల పెచ్చరిల్లుతున్న మత విద్వేషాల ప్రభావం తెలంగాణ పైన, హైదరాబాద్ పైన పడలేదనే విషయాన్ని మేం గ్రహించామని, ఇది నిజంగా బీజేపీ మతతత్వ శక్తులకు సరైన గుణపాఠంగా నిలిచిందని సమావేశంలో పాల్గొన్న రైతులు స్పష్టం చేశారు.

జాతీయ రైతు సంఘాల నేతలను సన్మానించిన సీఎం కేసీఆర్:

జాతీయ రైతు సంఘాల నేతలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్ రెడ్డి, బాల్క సుమన్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డితోపాటు దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన 100 మంది రైతులు పాల్గొన్నారు. కాగా, మూడు రోజులపాటు తెలంగాణలో సాగిన జాతీయ రైతు సంఘాల నేతల పర్యటన ఆదివారంతో ముగిసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here