రాష్ట్రంలోని మొత్తం 142 మున్సిపాలిటీలు, నగరాల్లో సమీకృత మార్కెట్లు: సీఎం కేసీఆర్

CM empowers gram panchayats to spend money on its own, CM KCR Decided to Construct Integrated Markets, CM KCR Decided to Construct Integrated Markets in 142 Municipalities and Corporations, Funds utilisation, Grassroots democracy, Integrated Markets Construction, Integrated Markets in 142 Municipalities and Corporations, Mango News, Telangana CM KCR, Telangana Integrated Markets, Telangana Integrated Markets Construction

రాష్ట్రంలోని మొత్తం 142 మున్సిపాలిటీలు, నగరాల్లో వెజ్ అండ్ నాన్ వెజ్, పండ్లు, పూల విక్రయానికి అనుకూలంగా సమీకృత మార్కెట్లను నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మార్కెట్లు మహిళలకు అందుబాటులో ఉండే విధంగా తగు విస్తీర్ణంలో ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేయాలన్నారు. గ్రామ పంచాయతీల నిధులను, ఆయా గ్రామ ప్రజలు పంచాయితీల నిర్ణయం మేరకే ఖర్చు చేసుకునే వీలు కల్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఇకనుంచి స్థానిక అవసరాల మేరకు నిధులను ఖర్చుచేసుకునే వెసులుబాటు పంచాయతీలకు లభిస్తుందని సీఎం తెలిపారు.

అలాగే గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజల ఇండ్ల మీదుగా పోయే విద్యుత్ లైన్లను ప్రభుత్వ ఖర్చుతోనే మార్చాలని ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావును సీఎం ఆదేశించారు. ఇక అన్ని నూతన జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాల నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఇందుకు సంబంధించి డీజీపీ మహేందర్ రెడ్డికి సీఎం ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తో కూడిన అదనపు పోలీసు స్టేషన్లు నిర్మించాలని సీఎం నిర్ణయించారు. మహిళా పోలీసు విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం విధి విధానాలు ఖరారు చేసి జీ.వోలు జారీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.

శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో వివిధ నియోజకవర్గాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, స్థానిక సంస్థల సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తున్న నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడివున్నదని తెలిపారు. ఆర్ అండ్ బి, ఇరిగేషన్, హోం, పంచాయతీ రాజ్ తదితర శాఖలకు సంబంధించి, ఆయా నియోజకవర్గాల పరిధిలో పలు పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను మంజూరు చేస్తూ సీఎం నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేల అభ్యర్థనల మేరకు, వారి నియోజకవర్గాల్లో పెండింగులో ఉన్న పనులతో సహా కొత్త పనులకు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఫోన్లల్లో మాట్లాడి, అనుమతులను మంజూరు చేశారు.

రైల్వే లైన్లు ఉన్న పట్టణాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించే దిశగా ఆర్వోబి (రైల్వే వోవర్ బ్రిడ్జిలు) అండర్ పాస్ ల నిర్మాణం, పలు పట్టణాల్లో రోడ్ల వెడల్పు, డివైడర్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు, నదులు కాల్వల మీద అవసరమైన చోట చెక్ డ్యాంల నిర్మాణం వంటి పనులను మంజూరు చేయించారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ప్రాజెక్టుల కింద పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. కాళేశ్వరం నీళ్లతో చెరువులు నింపాలన్నారు. పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు యాసంగి పంటల కోసం ఆయా ప్రాజెక్టుల కింద నీటిని విడుదల చేయించారు.

కొల్లాపూర్ నియోజవర్గ పరిధిలో యాసంగి పంటలకు నీరందించాలని ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి నిరంజన్ రెడ్డిని సీఎం ఆదేశించారు. పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అభ్యర్థన మేరకు పెద్దపల్లి నియోజక వర్గం పరిధిలోని పంట పొలాలకు యాసంగి పంటకు తక్షణమే నీరును విడుదల చేయాలని కాళేశ్వరం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఎస్పారెస్పీ గేట్లను తక్షణమే ఎత్తివేశారు. సీఎం నిర్ణయం ద్వారా పెద్దపెల్లి జిల్లా సహా మంథని మండలంలోని ఎక్లాస్ పూర్ వరకు, ఓదెల కాల్వ శ్రీరాంపూర్ చివరి ఆయకట్టు వరకు యాసంగి పంటకు సాగునీరు అందనున్నది. ఈ సందర్భంగా నకిరేకల్ మానకొండూరు, వరంగల్, నర్సంపేట, కొడంగల్, జగిత్యాల, దేవరకద్ర, గద్వాల, కోరుట్ల, కొల్లాపూర్, నారాయణ్ ఖేడ్, నర్సాపూర్ తదితర నియోజ వర్గాల్లోని పెండింగ్, నూతన అభివృద్ధి పనుల మంజూరుపై సీఎం సానుకూలంగా స్పందించారు.

ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి, సుంకె రవిశంకర్, హర్షవర్దన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మదన్ రెడ్డి, గంపా గోవర్దన్, అబ్రహం, సంజయ్ కుమార్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కాలె యాదయ్య, హన్మంత్ షిండే, పట్నం నరేందర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రసమయి బాలకిషన్, జైపాల్ యాదవ్, సండ్ర వెంకట వీరయ్య, కృష్ణమోహన్ రెడ్డి, సీఎం సెక్రటరీలు భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ