పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ వరుసగా రెండ్రోజులు సమీక్ష

#KCR, CM KCR Review Meeting Over Palamuru Rangareddy Lift Irrigation Scheme, KCR Over Palamuru Rangareddy Lift Irrigation Scheme, KCR Review on Palamuru Rangareddy Lift Irrigation Scheme, Lift Irrigation Scheme News, Mango News, Palamuru Rangareddy Lift Irrigation, Palamuru Rangareddy Lift Irrigation Scheme, Palamuru Rangareddy Lift Irrigation Scheme News, Palamuru Rangareddy Lift Irrigation Scheme updates, Palamuru Rangareddy Lift Irrigation Scheme Works, Progress of Works on Palamuru Rangareddy Lift Irrigation Scheme, Telangana CM KCR

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి ఎకరాన్ని కృష్ణా జలాలతో తడపాలంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో అనుసంధానించి నీరందించే ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరమున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు, జిల్లాను ఆనుకుని వున్న తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా సాగునీటిని అందించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను సిద్ధం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి మరింతగా విస్తరించాలని నిర్ణయించిన సీఎం ఆదివారం నుంచి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రారంభించిన సమీక్షా సమావేశం రెండోరోజు సోమవారం కూడా కొనసాగింది. ప్రగతి భవన్ లో సాగిన సుధీర్ఘ సమీక్షా సమావేశంలో కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాల పనులను విస్తరించడం కోసం సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళికలను అనుసరించాల్సిన కార్యాచరణను ఇరిగేషన్ అధికారులకు పాలమూరు-రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ప్రజా ప్రతినిధులకు సీఎం క్షుణ్ణంగా వివరించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కృష్ణా నదీ ప్రవాహం అక్టోబర్ నెల వరకే కొనసాగుతుందని, ఈ లోపు మనకు కేటాయించిన నీటి వాటాను వీలైనంతగా ఎత్తిపోసుకొని పాలమూరు ఎండిన బీళ్లను తడుపుకోవాలన్నారు. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉన్నదని, అందులో ఏర్పాటు చేసుకున్న రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉండటంతో దాని పరిధిలోని ఆయకట్టుకు నీరందడం కష్టమన్నారు. కల్వకుర్తి లిఫ్టు ఆయకట్టును పూర్తిస్థాయిలో స్థిరీకరించేందుకు పాలమూరు లిఫ్టు పనులను వేగవంతంగా కొనసాగించి, ఎక్కడికక్కడే అనుసంధానించుకోవాలన్నారు. ఇందులో భాగంగా ఉద్దండాపూర్ రిజర్వాయర్ ను నింపుకొని కొడంగల్, నారాయణ పేట్, పరిగి, తాండూర్, చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల పరిధిలో సాగుభూములకు గ్రావిటీ ద్వారా నీరందించే అవకాశాలను సీఎం మ్యాపుల ద్వారా పరిశీలించి, అధికారులతో చర్చించారు. అందుకు సంబంధించి ప్రధాన కాలువల నిర్మాణం సహా, ప్రతి చెరువును నింపే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో నీరందకుండా ఉన్న సాగు భూములను కూడా తడపాలన్నారు. మహబూబ్ నగర్ నుంచి కిందికి ఉన్న భూములకు సాగునీరందించే విధి, విధానాలపై చర్చించిన సీఎం పైకి నీళ్లను తీసుకెళ్లి, తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు నీరందించేలా కాల్వల నిర్మాణంపై చర్చించారు. కాల్వలు, వాగుల ద్వారా నీటిని తీసుకెళ్లే క్రమంలో చెక్ డ్యాములు పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని, చెరువులు నింపుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని భూత్పూర్, ఘన్ పూర్, మూసాపేట, అడ్డకల్ మండలాల్లో తాగునీటిని తీసుకెళ్లే మార్గాలను సీఎం డిజిటల్ స్క్రీన్ పై అన్వేషించారు. కాంటూరు లెవల్స్ ను పరిశీలించారు. వీలైనంత వరకు గ్రావిటీ ద్వారా నీటిని మహబూబ్ నగర్ జిల్లా చుట్టూ ఎట్లా తిప్పవచ్చనే విషయమై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాళేశ్వరం పనులు పూర్తయినందున ఇక నుంచి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంపైనే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని, వారం వారం క్షేత్రస్థాయి పర్యటనలు కూడా జరపాలని పునరుద్ఘాటించారు. నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన భూసేకరణ, నిర్వాసితులకు ఇవ్వాల్సిన ఆర్ అండ్ ఆర్ వ్యవహారాలను స్థానిక ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలన్నారు. ఇక నుంచి పర్యటనలు మొదలవుతున్నందున అనువైన చోట ఒక గెస్టు హౌజ్ ను నిర్మించాలని సూచించారు.

‘‘యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసుకున్నాం. అదే స్ఫూర్తితో పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసుకోవాల్సి ఉన్నది. మనకు ఇక మిగిలింది సీతారామ, డిండి ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులే. కావాల్సిన నిధులన్నీ సంపూర్ణంగా సమకూర్చుతాం. వాటిని కూడా సత్వరమే పూర్తి చేసుకుందాం. పాలమూరు-కల్వకుర్తి, మరియు పాలమూరు-జూరాల పథకాలను అనుసంధానం చేయడం ద్వారా మాత్రమే ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలను పూర్తిస్థాయిలో సస్యశ్యామలం చేసుకోవచ్చు’’ సీఎం కేసీఆర్ అన్నారు.

అచ్చంపేట లిఫ్టు ఇరిగేషన్ స్కీం సర్వే పనులను సత్వరమే పూర్తిచేసి, ఎస్టిమేట్లను పరిపాలనా అనుమతులకోసం పంపాల్సిందిగా సూచించారు. బల్మూర్, లింగాల అమ్రాబాద్ ప్రాంతంలో 60 వేల ఎకరాలకు సాగునీరందించాలి. ఇందుకోసం ఏదుల రిజర్వాయర్ నుంచి 22 కిలోమీటర్లు కాల్వ తీసి, లింగాల దగ్గర లిఫ్టును ఏర్పాటు చేయాలి. అక్కడి నుంచి మైలారం దగ్గర మూడు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ ను ఏర్పాటు చేయాలి. దానికి ఉమామహేశ్వరం అనే పేరును సీఎం సూచించారు. అక్కడినుంచి చంద్రసాగర్ కు కాల్వ ద్వారా నీరందించి, అక్కడినుంచి అమ్రాబాద్ మండలంలోని మున్ననూరులో 1.4 టీఎంసీ సామర్థ్యంతో ఒక రిజర్వాయర్ ను ఏర్పాటు చేసి, ఎత్తిపోయాలన్నారు. ఈ రిజర్వాయర్ కు స్థానిక చారిత్రక నేపథ్యమున్న చెన్నకేశవుని పేరును పెట్టాల్సిందిగా సీఎం సూచించారు. ఇందుకు సంబంధించిన సర్వే పనులను త్వరగా పూర్తి చేయాలని, ఇందుకు సంబంధించి మే నెలలో శంకుస్థాపన చేసుకుందామన్నారు. అలాగే కోయిల్ సాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడానికి గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాజోలిబండ ప్రాజెక్టు పరిధిలో ఉన్న చిన్నోనిపల్లి రిజర్వాయర్ ను పూర్తి చేయాలని, ఆర్డీఎస్ కాలువ ఆధునికీకరణ పనులను పూర్తి చేయాలని, తుమ్మిళ్ల లిఫ్టు మిగిలిపోయిన పనులను కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గట్టు రిజర్వాయర్ ను మూడు టీఎంసీల సామర్థ్యానికి పెంచాలని ఆదేశించారు. జూరాల మీద ఆధారపడిన నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, జూరాల సొంత ఆయకట్టుతోపాటు, మిషన్ భగీరథకు నిరంతరం నీరందించే బరువంతా జూరాలపైనే ఉన్నందున అక్కడ నీటి లభ్యతను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా పాలమూరు- జూరాలను అనుసంధానం చేయడం వల్ల సహజమైన నీరు, రీ జనరేటెడ్ వాటర్, కెనాల్ నీటితో సంవత్సరం పొడవునా కళకళలాడుతుందన్నారు. జూరాల పరిధిలో 24 మున్సిపాలిటీలు, గ్రామాలకు తాగునీరు, పరిశ్రమలకు నీరందించే వెసులుబాటు తద్వారా కలుగుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వారిలో మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, అబ్రహం, అంజయ్య యాదవ్, కృష్ణమోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, రామ్మోహన్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, దివాకర్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఇఎన్సీ మురళీధర్ రావు, ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, సలహాదారు పెంటారెడ్డి, సీఈలు వి.రమేశ్, శ్రీనివాస్, హమీద్ ఖాన్, ఎస్ఈలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ