తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మంత్రులు, అధికారులు మరియు అన్ని జిల్లాల కలెక్టర్లతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని సింగాయిపల్లి, కోమటిబండ, నెంటూరు ప్రాంతాల్లో చేపట్టిన అడవుల పునరుద్ధరణను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారంలో భాగంగా చేపట్టిన మొక్కల పెంపకం ఫలితాలు మూడేళ్ళ తరువాత కనిపిస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. కోటికిపైగా మొక్కలు నాటి గజ్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సాధించిన అడవుల పునరుద్ధరణను సీఎం కెసిఆర్ కలెక్టర్లకు,మంత్రులకు స్వయంగా చూపించారు. ఈ ప్రాంతాలని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూముల్లో అడవుల పునరుద్ధరణకు కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.
అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సందర్శించిన అనంతరం ముఖ్యమంత్రి కోమటిబండలో నిర్మించిన మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించారు. కలెక్టర్లతో కలిసి ముఖ్యమంత్రి అక్కడే భోజనం చేసారు. తరువాత కలెక్టర్లతో సమావేశమై కొత్త పంచాయితీరాజ్ చట్టం, కొత్త మునిసిపల్ చట్టం అమలు, కొత్త రెవిన్యూ చట్టం రూపకల్పనపై చర్చించారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతూ ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని, దీనికి అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలనీ కోరారు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేని, రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకమైన రెవిన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.
[subscribe]
[youtube_video videoid=zkgTJglH-xk]








































