కాగ్నిజెంట్‌ కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన రేపే

ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్‌..హైదరాబాద్‌లో తమ కొత్త క్యాంపస్‌ను ఆగస్ట్ 14 అంటే రేపు శంకుస్థాపన చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తమ అమెరికా పర్యటనలో భాగంగా ..కాగ్నిజెంట్ కంపెనీ సీఈవో రవికుమార్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే న్యూజెర్సీలో ఆగస్ట్ 5వ తేదీన తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా.. కాగ్నిజెంట్ కంపెనీ కేవలం పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టడం ప్రాముఖ్యత సంతరించుకుంది.

టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ హబ్‌గా మారిన టెక్ హబ్ హైదరాబాద్‌లో తమ కంపెనీని విస్తరించటం చాలా సంతోషంగా ఉందని ఇటీవల కాగ్నిజెంట్‌ సీఈవో ఎస్‌.రవికుమార్‌ చెప్పారు. హైదరాబాద్‌లో నెలకొల్పే కొత్త సెంటర్‌..ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించడానికి ఉపయోగపడుతుందని అన్నారు.తమ కంపెనీ ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్‌లో కూడా అత్యాధునిక పరిష్కారాలు అందిస్తుందని ఎస్.రవికుమార్ చెప్పారు.

ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కాగ్నిజెంట్‌ కంపెనీ కొత్త సెంటర్‌ ఏర్పాటుతో.. ప్రపంచస్థాయి టెక్నాలజీ కంపెనీలు హైదరాబాద్‌ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగ్నిజెంట్‌కు తమ కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మద్దతు అందిస్తుందని ప్రకటించారు. కాగ్నిజెంట్ కొత్త సెంటర్‌ ఏర్పాటుతో వేల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తుందని.. అలాగే అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

తెలంగాణ ప్రభుత్వంతో తమ ఒప్పందంలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ముందుగానే వెల్లడించింది. హైదరాబాద్ లో 10 లక్షల చదనపు అడుగుల కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తామని దీనివల్ల అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ ప్రకటించింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డిజిటల్‌ ఇంజనీరింగ్‌, క్లౌడ్‌ సొల్యూషన్స్‌తో పాటు.. వివిధ అధునాతన సాంకేతికతలపై కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ఫోకస్​ చేస్తుంది. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని రేపు అంటే ఆగస్ట్ 14వ తేదీ ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. అదేరోజు రేవంత్ రెడ్డి కాగ్నిజెంట్ కంపెనీ శంకుస్థాపనలో పాల్గొంటారు అలాగే.. కాగ్నిజెంట్‌ సీఈవో రవికుమార్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.