తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిన్నటి నుంచి తెలంగాణ రాజకీయాలతో పాటు సినీఇండస్ట్రీలోనూ పెను దుమారాన్ని రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శిస్తూ వచ్చిన కొండా సురేఖ తెలుగు సినీ ఇండస్ట్రీని రాజకీయాల్లోకి లాగారు. ముఖ్యంగా సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను చెబుతూ హద్దులు దాటి వారి పర్సనల్ విషయాలను మీడియా వేదికగా మాట్లాడటంపై అన్ని వర్గా నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది.
కొండా సురేఖ వ్యాఖ్యలను ఇప్పటికే నాగార్జున , అమల, నాగ చైతన్యతో పాటు ఇటు సమంత తీవ్రంగా ఖండించారు. తాజాగా సురేఖ వ్యాఖ్యలపై ఎన్టీఆర్, నాని కూడా కాస్త ఘాటుగానే స్పందించారు. వ్యక్తిగత జీవితాలను బయటకు తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అంటూ ఎన్టీఆర్ మండిపడ్డారు ఆధారాల్లేని వ్యాఖ్యలు చేస్తే చూస్తూ మౌనంగా ఎలా కూర్చుంటామంటూ హెచ్చరించారు. ఇటు కొండా సురేఖ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని నాని మండిపడ్డారు.
కొండా సురేఖ గారూ.. వ్యక్తగత జీవితాలను బయటకు లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ప్రజాజీవితంలో ఉన్న మీలాంటి వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించాలి. బాధ్యతారాహిత్యంగా సినీఇండస్ట్రీపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా చాలా బాధాకరం. ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చునేదే లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండటానికి ఈ అంశాన్ని కచ్చితం లేవతెత్తాం అంటూ ఎన్టీఆర్ ఫైర్ అయ్యారు.
రాజకీయ నాయకులు ఇష్టంవచ్చినట్లుగా, అర్థంపర్ధం లేని వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడటం చూస్తుంటే అసహ్యంగా ఉందని నాని ట్వీట్ చేశారు. బాధ్యత లేకుండా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే.. ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా అనిపిస్తోంది. ఇది కేవలం సినిమా నటులు, చిత్ర పరిశ్రమ, రాజకీయపార్టీకి సంబంధించిన అంశం కాదు..గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ప్రముఖ వ్యక్తి ఇలాంటి ఆరోపణులు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని హీరో నాని ఫైర్ అయ్యారు.