తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు భారీ షాక్ తగిలింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు గురువారం వీరిద్దరికి సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో ప్రజా ధనానికి భారీ నష్టం జరిగిందని భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్, స్మితా సబర్వాల్‌కు నోటీసులు పంపిన న్యాయస్థానం.. అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
అలాగే ఎమ్మెల్యే హరీష్‌రావు, మేగా కృష్ణారెడ్డి, రజత్‌కుమార్, ఎల్‌అండీటీ ఎండీ సురేష్‌కుమార్, ఇరిగేషన్ చిఫ్ ఇంజినీర్లు హరి, రామ్‌కు సైతం నోటీసులు జారీ చేసింది. ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు గతంలోనే మాజీ సీఎం కేసీఆర్, మరో ఏడుగురికి నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్నవారిలో మాజీ మంత్రి హరీశ్ రావు తరపున లలిత రెడ్డి, సుకన్య, అడ్వకేట్లు మెమో అప్పిరియన్స్ అయ్యారు. మెగా కృష్ణారెడ్డి, రజత్ కుమార్, ఎల్అండ్ టీ ఎండీ సురేశ్ కుమార్ తరపున సుప్రీంకోర్టు అడ్వకేట్ అవదాని, శ్రావణ్ రావు హాజరయ్యారు. అయితే, ఈరోజు మాత్రం మాజీ సీఎం కేసీఆర్, ఐఏఎస్ స్మితా సబర్వాల్ కోర్టుకు హాజరుకాకపోవడంతో అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది.
రూ.35 వేల కోట్ల ప్రాజెక్టును.. రూ.లక్ష 35 వేల కోట్లకు వ్యయం పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందుకు తాము న్యాయ పోరాటం చేస్తున్నామని రాజలింగమూర్తి అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ఇలాంటి తప్పులు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమ కట్టడాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు చేరవేస్తామని తెలిపారు. రేపటి భవిష్యత్తు తరాలకు చెరువులను, కుంటలను పునర్నిర్మించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇది ఇలావుండగా, ‘కేసీఆర్ కనబడుట లేదు’ అంటూ హైదరాబాద్ నగరంలో బుధవారం పలు పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో కష్టాలు పడుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ పత్తా లేడు అంటూ సదరు పోస్టర్లలో పేర్కొన్నారు. అయితే, ఈ పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారనేది మాత్రం తెలియరాలేదు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో మృతి చెందగా, వందల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఖమ్మంతోపాటు పలు జిల్లాల్లోనూ భారీ పంట నష్టం జరిగింది.
అయినప్పటికీ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ వరద బాధితులను పరామర్శించేందుకు బయటకు రాకపోవడంపై ఇప్పటికే అధికార పక్షం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కనబడుట లేదు అంటూ పోస్టుర్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. కేసీఆర్ ప్రజల్లోకి రాకపోయినప్పటికీ.. హరీశ్ రావుతోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.