కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి తెచ్చిన అద్భుత కార్యక్రమం ప్రజాపాలన. ఏళ్ల తరబడి సంక్షేమ పథకాలకు నోచుకోని ఎంతో మంది పేదలకు ఇది వరంగా మారింది. అందుకే కార్యక్రమం ప్రారంభం కాగానే తండోపతండాలుగా వెళ్లి దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది డిసెంబరు 27న ప్రారంభమైన ప్రజాపాలన లో 1,25,84,383 మంది సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో ఐదు గ్యారెంటీల కోసమే 1,05,91,636 దరఖాస్తులు వచ్చాయి. ఇతరత్రా వాటి కోసం 19,92,747 దరఖాస్తులు వచ్చాయి. గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీ, కార్పొరేషన్ల వార్డుల్లో ఈ దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు, 3,623 వార్డులకు తరలివెళ్లి ప్రజలు సంక్షేమ పథకాల కోసం అర్జీలు ఇచ్చారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి ఈ కార్యక్రమం సజావుగా సాగేలా చర్యలు తీసుకోవడంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు.
ప్రజాపాలన ముగిసిన వెంటనే మ్యాన్యువల్ గా తీసుకున్న ఆ దరఖాస్తులను డేటా ఎంట్రీ ప్రక్రియ కూడా మొదలుపెట్టేశారు. సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చి ఎక్కడా, ఎటువంటి పొరపాట్లు జరగకుండా డేటాను నిక్షిప్తం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. సీఎస్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. అకస్మాత్తుగా రోడ్లపై ప్రజాపాలన దరఖాస్తులు కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం బాలానగర్ ఫ్లై ఓవర్‌పై ఆ దరఖాస్తులు దర్శన మివ్వడంతో అటు వైపుగా వెళుతున్న వాహన దారులంతా ఒక్కసారిగా గుమిగూడారు. వాటిని పరిశీలించిన వాహనదారులు అవి అభయహస్తం దరఖాస్తులని గుర్తించారు. ఇంకో విషయం ఏంటంటే.. కూకట్‌పల్లి సర్కిల్ బాలానగర్ ఫ్లై ఓవర్ పై కనిపించిన ఆ దరఖాస్తులు ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయానికి చెందినవి. ఓ యువకుడు బైకుపై తీసుకు వెళ్తుండగా, దరఖాస్తులు జారి కిందపడడంతో ఈ విషయం బయట పడింది. ఎల్బీనగర్ సర్కిల్ అధికారుల పరిశీలనలో ఉండాల్సిన ప్రజా పాలన ధరఖాస్తులు ఇలా బాలానగర్‌లో ప్రత్యక్షం కావడంతో అన్ని కేంద్రాలలో ఇదే పరిస్థితి ఉందా అనే అనుమానాలు తలెత్తాయి.
ఇదిలా ఉండగా.. ఆ మర్నాడు కుత్బుల్లాపూర్ సర్కిల్ లో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాల్సిన దరఖాస్తులు ప్రైవేటు వ్యక్తుల వద్ద కనిపించాయి. ఆ యువకులను ప్రశ్నించగా.. డేటా ఎంట్రీ చేయడానికి ఇంటికి తీసుకెళ్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. వీలైనంత త్వరగా ప్రజాపాలనను కంప్యూటరీకరించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ప్రైవేటు వ్యక్తులకు ఈ బాధ్యత అప్పగించారు. కార్యాలయాల్లో ఉండి చేయాల్సిన పనిని ఇంటికి ఇవ్వడంపై దుమారం రేగుతోంది. బహుశా.. దాంట్లో ఎటువంటి దురుద్దేశం లేకపోయినా.. వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకే అయినా.. రోడ్లపై దరఖాస్తులు కనిపించడం ఆందోళనకు కారణమైంది. ఇందుకు సంబంధించి సర్కారు ఇప్పటికే ఇద్దరు అధికారులపై వేటు వేసింది. దీని ద్వారా.. జాగ్రత్తగా ఉండకపోతే చర్యలు తప్పవనే సంకేతాలు ఇతర సిబ్బందికి చేరవేసింది. ఈ విషయంలో ప్రభుత్వ స్పందనను ఆహ్వానించవలసిందే.
అలాగే.. ప్రభుత్వం మరో విషయాన్ని గుర్తించాలి. గత ప్రభుత్వంలో దాదాపు ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ చేపట్ట లేదు. ఎన్నికల ముందు కూడా దానిపై ప్రకటన చేయలేదు. రేషన్ కార్డు లేక లక్షలాది మంది అర్హత ఉన్నప్పటికీ.. ప్రభుత్వ సాయం పొందలేకపోయారు. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, వచ్చిన వెంటనే ప్రజాపాలన పేరుతో సంక్షేమ పథకాలు ప్రకటించి దరఖాస్తులను ఆహ్వానించడం ప్రజల్లో సంతోషాన్ని నింపింది. రేషన్ కార్డులు, ఇతర పథకాల కోసం కోట్లాది మంది ఉత్సాహంగా వెళ్లి దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల గుర్తింపునకు సబ్ కమిటీలు, సర్వేలు అంటూ ప్రకటిస్తున్న ప్రభుత్వం ఆ కోట్లాది మందికి నిజంగా న్యాయం చేస్తుందా.. లేదా చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE