
తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గతం కంటే పోలింగ్ శాతం పెరిగింది. గ్రామీణ ఓటర్లు భారీగా తరలివచ్చారు. గతంతో పోల్చుకుంటే పట్టణ ఓటర్లలోనూ కాస్త చైతన్యం పెరిగింది. ఫలితంగా పోలింగ్ శాతం పెరిగింది. పెరిగిన ఈ పోలింగ్ శాతం ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అని ఆయా పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. తెలంగాణలో కంటోన్మెంట్ అసెంబ్లీ సహా.. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మినహా.. మిగతా చోట్ల సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. 2019తో పోల్చితే ఈసారి ఎక్కువే పోల్ శాతం నమోదైంది. 2019లో 62.77 శాతం ఓటింగ్ నమోదవగా.. ఈసారి పోలింగ్ శాతం 70 దాటింది. పలు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఓటింగ్ శాతం 75గా ఉంది.
భువనగిరి, జహీరాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ ప్రాంతాల్లో 75శాతానికి పైగా పోలింగ్ నమోదైన పరిస్థితి ఉంది. పోలింగ్ శాతం పెరగడానికి తోడు.. చాలా చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగిందని ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్ పార్టీ ఓట్లు భారీగా క్రాస్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఒకటి, రెండు శాతం ఓట్లే గెలుపు ఓటములు నిర్ణయించే క్రమంలో క్రాస్ అయిన బీఆర్‌ఎస్ పార్టీ ఓట్లు.. ఎవరి కొంప ముంచుతాయోనన్న ఆందోళన ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు, అటు బీజేపీ వర్గాల్లోనూ నెలకొంది. 17 లోక్‌సభ సెగ్మెంట్‌లలో చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, మల్కాజిగిరి, జహీరాబాద్, నిజామాబాద్ వంటి చోట్ల క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందని చెబుతున్నారు. బీఆర్ ఎస్ లో ఉన్న వారు కూడా కొందరు కాంగ్రెస్, బీజేపీ వైపు మొగ్గుచూపారని సమాచారం. బీఆర్‌ఎస్ పార్టీలోని కాంగ్రెస్ వ్యతిరేకులు బీజేపీ వైపునకు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీ వ్యతిరేక భావజాలం ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి క్రాస్ చేసినట్లూ ఆయా నియోజకవర్గాల్లో చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ ఎస్ ను నమ్ముకుంటే.. ఇంకో ఐదేళ్ల వరకూ తమకు భవిష్యత్ ఉండదని భావించిన కొందరు నాయకులు.. లోక్ సభ ఎన్నికలను అవకాశంగా మార్చుకున్నారు. అధికార పార్టీకి అనువుగా ఉండి అవకాశాలు చేజిక్కించుకోవాలని ఉద్దేశంతో ఉన్నారు. ఈక్రమంలోనే.. కొందరు బీఆర్‌ఎస్ నేతలు.. కాంగ్రెస్ అభ్యర్థులకు క్రాస్ చేయడానికే మెగ్గు చూపినట్లూ చెబుతున్నారు. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ఉన్న వ్యక్తిగత పరిచయాలతోనూ క్రాస్ ఓటింగ్ జరిగిందంటున్నారు. చేవెళ్ల నియోజకవర్గం తీసుకుంటే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, అటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు ఇద్దరూ గతంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలుగా పనిచేసిన వారే. ఆ పార్టీ నాయకులతో ఇద్దరికీ వ్యక్తిగత పరిచయాలు, ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో ఎవరికి వీలైనంతగా వారు బీఆర్‌ఎస్ ఓటింగ్‌ను తమవైపునకు తిప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రాస్ ఓటింగ్ ద్వారా భారీగా బీజేపీనే లాభపడిందనే సమాధానాలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకూ ఆగాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY