తెలంగాణలో డెంగ్యూ ఫీవర్ ప్రజలను పట్టి పీడిస్తోంది. చాపకింద నీరులా విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5,372 మంది డెంగ్యూ బారిన పడ్డారు. జూన్ నెల చివరి వరకు 1,078 మందికి డెంగ్యూ నిర్ధారణ కాగా.. గత రెండు నెలలుగా 4,294 మందికి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్న ప్రతి 100 మందిలో 6.5 మందికి పాజిటివ్ వస్తోంది. అంటే వారికి డెంగీ ఉందని నిర్ధారణ అవుతోంది. డెంగీ లక్షణాలున్న వారి నుంచి సేకరించే ప్రతీ 200 శాంపిళ్ల లో 13 మందికి డెంగీ ఉన్నట్లు కన్ఫర్మ్ అవుతోందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది.
డెంగ్యూ కేసులు అత్యధికంగా హైదరాబాద్‌లో నమోదు అవుతున్నాయి. నిలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లల్లో చాలామందికి డెంగీ నిర్ధారణ అవుతోంది. బాధితుల్లో ఎక్కువగా ఏడాదిన్నర నుంచి 12 ఏళ్లలోపు పిల్లలే ఉంటున్నారు. హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో వరుసగా.. సూర్యాపేట, మేడ్చల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 8,016 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా డెంగీ కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరు అలర్ట్‌గా ఉండాలని. వర్షాలు కురుస్తుండటంతో సెప్టెంబరు నెలాఖరుకల్లా డెంగ్యూ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తోంది.
దోమల బెడద నుంచి తమను తాము రక్షించుకోవాలి. ప్రత్యేకించి ఉదయం వేళ దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి. డెంగ్యూకు కారణమయ్యే టైగర్ దోమ మంచి నీటిలో పెరుగుతుందని. ఇది ఎక్కువగా పగటిపూట మాత్రమే కుడుతుందని చెప్పారు. ఈ క్రమంలో స్కూళ్లు, ఆడుకోవడానికి బయటకు వెళ్తున్న చిన్నారులు దోమకాటు బారిన పడకుండా జాగ్రత్త పడాలని అంటున్నారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెబుతున్నారు. జ్వరం ఉంటే వైద్యులను సంప్రదించి తగిన మెడికల్ టెస్టులు చేయించుకోవాలి. ఎంత త్వరగా డెంగీ లక్షణాలను గుర్తిస్తే అంత ఈజీగా చికిత్స పూర్తయి కోలుకుంటారు. డెంగ్యూతో పాటుగా రాష్ట్రంలో గన్యా కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. గన్యా ఉందన్న అనుమానంతో 2,673 నమూనాలను పరీక్షించగా వారులో 152 మందికి పాజిటివ్‌గా తేలింది. దీనికి సంబంధించి 5 శాతం పాజిటివిటీ రేటు ఉంది. ఈ కేసులు అత్యధికంగా హైదరాబాద్ నగరంతో పాటు వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వెలుగు చూస్తున్నాయి.