దసరా పండుగ రోజు తెలంగాణ సర్కారు రెండు శుభవార్తలు చెప్పింది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏటా రూ.20 వేలకోట్లు వడ్డీ లేని రుణాలు అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఐదేళ్లలోపు మొత్తం లక్ష కోట్ల రూపాయలను స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేకుండా అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని భట్టి విక్రమార్క చెప్పారు.
ఇక తెలంగాణ రైతులకు సైతం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. రైతుల బోరు బావులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఈ నిర్ణయంతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని.. అదనపు ఆదాయం వస్తుందన్నారు0. అశ్వరావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో రూ.36కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సోలార్ పంపు సెట్లపై కీలక ప్రకటన చేశారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. న్యూ ఎనర్జీ పాలసీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.. త్వరలోనే రైతుల బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా రైతులకు కరెంట్ ఖర్చు ఉండదన్నారు. పైగా సోలార్ ప్యానల్స్ ద్వారా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయడం వల్ల రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. పంటతోపాటు పవర్‌పైనా అన్నదాతలు అదనపు లాభం పొందేలా పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నాం. ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఖర్చుతో రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టు చేపడతాం.
విజయ దశమి రోజు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో బయో మాస్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రపంచమంతా థర్మల్ పవర్ నుంచి గ్రీన్ పవర్ వైపు అడుగులు వేస్తోంది. తెలంగాణలో 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని.. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు రుణమాఫీపై విమర్శలు చేయడం దారుణమని.. తాము చేసిన మంచిని చూసి వాళ్లు ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. అలాగే రైతులకు పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని.. రూ.73వేల కోట్లు తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయించామని చెప్పారు.