తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కొన్ని ప్రభుత్వ పథకాలను కూడా ప్రారంభించాలని రేవంత్ ప్రభుత్వం చూస్తుంది. ముఖ్యంగా ఈ ఉగాది నుంచి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక..సంక్షేమ పథకాల అమలులో భాగంగా.. రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే సంక్రాంతి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని ముందుగా చెప్పినా.. తర్వాత వాయిదా వేశారు.కాగా ఇప్పుడు ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది రేవంత్ సర్కార్. ఏప్రిల్ 1న హుజూర్నగర్ పట్టణంలో చిన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తాజాగా పేర్కొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 91వేల19వేల 269 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 2కోట్ల82లక్షల 77వేల 859 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. హుజూర్నగర్ పట్టణంలో ముందుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని.. ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీని అమలు చేస్తారని అధికారులు తెలుపుతున్నారు.
రేషన్ కార్డులో ఉన్న అక్రమాలను తొలగించడానికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు అధికారపార్టీ నేతలు చెబుతున్నారు. పేదల కోసం.. పంపిణీ చేయబోయే సన్నబియ్యం పక్కదారి పడకుండా ఉండటానికి పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. ఇప్పటికే రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తుండగా పట్టుకున్న సంఘటనలు తెలంగాణలో చోటు చేసుకున్నాయి. మరోవైపు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న కొంతమంది..ఇంకా తమ పేరు రాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు రేషన్ కార్డు అంటే కేవలం సంక్షేమ పథకాల కోసం మాత్రమే ఉపయోగపడుతుందని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో..ఇకపై రేషన్ కార్డుకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.