జనవరి 26న తెలంగాణ ప్రభుత్వం నాలుగు కొత్త పథకాలను ప్రారంభించింది. అధికారంలోకి వస్తే పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్లుగానే ఇందిరమ్మ ఇళ‍్ల పథకాన్ని ప్రారంభించింది. అంతకు ముందే గ్రామ, వార్డు సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు.అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల జాబితాలో ఎవరి పేరయినా ఉందా లేదా అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివాళ్లు వారి అప్ డేట్ తెలుసుకోవడానికి ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
మొబైల్ సాయంతోనే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు, మంజూరు, ఏ దశలో ఉందో ఈజీగా తెలుసుకోవచ్చని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఎన్నికల హామీ అమలు కోసం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రామ సభల ద్వారా ఆన్‌లైన్ వేదికగా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు స్వీకరించగా.. కొందరికి ఇప్పటికే ఇల్లు మంజూరయినట్లు లబ్దిదారులు చెబుతున్నారు. అయితే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ఏ దశలో ఉందనే విషయంతో పాటు..ఈపథకం కింద ఆర్థిక సాయం ఎప్పుడు వస్తుంది.. ఇళ్ల నిర్మాణానికి ఏం చేయాలి అనే వివరాలు కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. మంజూరు అయిన ఇల్లు ఎల్-1, ఎల్-2, ఎల్-3 లలో ఏ జాబితాలో ఉందో అనే విషయం తెలుసుకోవచ్చు. అంతేకాదు ఏ కారణంతో ఇల్లు మంజూరు కాలేదనే వివరాలు కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఇందిరమ్మ ఇళ్ల కోసం స్టేటస్ చూడాలనుకుంటే ..ఆధార్ నంబర్/మొబైల్ నంబర్/రేషన్ కార్డు నంబర్‌తో ఈ వివరాలు తెలుసుకోవచ్చు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన https://indirammaindlu.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లో ఈ వివరాలను పరిశీలించుకోవచ్చు. వెబ్‌సైట్ తెరిచాక గ్రీవెన్స్ స్టేటస్‌ను ఎంచుకుని..తర్వాత సెర్చ్‌లోకి వెళ్లి అక్కడ ఆధార్/ఫోన్ లేదా రేషన్‌కార్డు నంబర్ ఇలా ఏదైనా ఒకటి ఎంటర్‌చేయాలి. తర్వాత వారికి సంబంధించిన వివరాలు అందులో వస్తాయి. ఆ వెబ్ సైట్ లో ఇందిరమ్మ ఇళ్లు దరఖాస్తుల ప్రక్రియ ఏ స్టేజిలో ఉందో తెలుస్తుంది.ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని వెబ్‌సైట్ ద్వారా తెలపాల్సి ఉంటుంది.