తెలంగాణ రైతులంతా జనవరి 26 కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే..వారందరికీ జనవరి 26 గణతంత్ర దినోత్సవం మాత్రమే కాదు..తమకు భరోసా నిధులు అందే పండగరోజు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై కసరత్తులు పూర్తి చేసింది. నిధులు విడుదల చేయడానికి అంతా రెడీ చేసింది.
రైతు భరోసా..వ్యవసాయం చేసే రైతులందరికీ వర్తిస్తుందని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇది రైతులందరికీ వస్తుంది. కాని వారందరికీ వ్యవసాయ భూమి ఉండేవారికే అది వర్తిస్తుందని మెలిక పెట్టింది. దీంతో రెండు మూడు రోజులుగా రైతుల్లో కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. భూమి ఉన్నా.. ఆ సీజన్‌లో పంటవేయకపోతే భరోసా నిధులు రావనే వార్తలు వినిపించడంతో..దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తోంది.
తెలంగాణలోని మొత్తం 1.35 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి రైతు భరోసా వర్తించేలా పథకాన్ని రూపొందించారు. దీంతో 64 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరబోతోంది. అంటే.. దాదాపు 12 లక్షల కుటుంబాలకు రైతు భరోసా వర్తిస్తుంది. గ్రామసభలతోనే రైతు భరోసా అర్హుల జాబితాను అధికారులు రూపొందించనున్నారు. ఈనెల 20 వరకు అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి..జనవరి 26 నుంచి రైతుల అకౌంట్లలో భరోసా నిధులు జమ చేస్తారు
ఎకరానికి 6వేల రూపాయల చొప్పున, ఏడాదికి రూ.12వేలు భరోసా నగదు రైతులకు జనవరి 26న లభించనున్నాయి. దీని కోసం ప్రభుత్వం రూ.9వేల కోట్లు విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. భూమిలేని ఉపాధిహామీ కూలీలకు ఏడాదికి రూ.12వేల ఆత్మీయ భరోసా లభించనుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.700 కోట్లు విడుదల చేయనున్నారు.
కాగా..మైనింగ్, కొండలు, గుట్టలున్న భూమికి రైతు భరోసా వర్తించదు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు,నివాస, పారిశ్రామిక, వాణిజ్య భూములు, నాలా కన్వర్టెడ్ భూములు, ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తించదని రేవంత్ సర్కారు తేల్చి చెప్పింది.
వ్యవసాయ భూమి, అందులోనూ సాగులో ఉన్న భూమికి రైతు భరోసా వర్తిస్తుంది. సాగు చేసే భూములే కాకుండా.. సాగుకు యోగ్యమైన భూములకు కూడా రైతు భరోసా ఉంటుంది. అంటే ఆ సీజన్‌లో పంట వేయకున్నా సాగులో ఉన్న భూమి అయితే చాలు భరోసా వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. రైతు భరోసాకు సంబంధించి ఈ రెండు, మూడు రోజుల్లోనే గైడ్ లైన్స్ విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.