శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మరణించిన కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం, ఇతరత్రా సహాయాలు ప్రకటించారు. మరణించిన డిఇ శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షలు, మిగతా వారందరి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. మరణించిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని, ఇతర శాఖాపరమైన ప్రయోజనాలు అందిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ముందుగా ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు ఫలించకపోవడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఈ ప్రమాదంపై సీఐడీ విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు రావాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu