వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో జరిగిన కలెక్టర్‌పై దాడి ఘటనలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన అనుచరుడు సురేష్ దాడి సమయంలో నరేందర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్లు ఆధారాలు లభ్యమైన కావడంతో దర్యాప్తు కొనసాగించడానికి అరెస్ట్ చేశారు.
ఇండస్ట్రీయల్ కారిడార్ ప్రతిపాదన, భూసేకరణపై గ్రామస్థుల ఆగ్రహం
లగచర్ల, పోలేపల్లి గ్రామాల్లో 1350 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఫార్మా విలేజ్ ప్రతిపాదనకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుకు మార్పులు చేసినా, గ్రామస్తుల నిరసనలు కొనసాగుతూనే ఉంది. కాగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం సోమవారం జరిగిన సమావేశంలో గ్రామస్థులు కలెక్టర్ సహా అధికారులపై దాడికి పాల్పడ్డారు. దాడిలో కలెక్టర్‌కు గాయాలయ్యాయి, ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలకు ఆదేశించింది.
55 మంది అరెస్టు
దాడి అనంతరం జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి, దాదాపు 55 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 16 మందిని కోర్టులో హాజరు పరచి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. పోలీసుల కథనం ప్రకారం, ప్రధాన నిందితుడు సురేష్, పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు. సురేష్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు, అయితే గతంలో సురేష్‌పై నమోదైన కేసులను తొలగించడానికి నరేందర్ రెడ్డి సహకరించినట్లు దర్యాప్తులో వెలుగుచూసింది.
రాజకీయ ఆరోపణలు
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అధికారులపై దాడి ఘటనకు బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాడిని ఖండిస్తూ, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.