తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్ దిల్ రాజు సమక్షంలో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల గైడ్‌లైన్స్ ఖరారయ్యాయి. హైదరాబాద్‌లోని సమాచార భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. 2014 నుండి 2023 వరకు ప్రతి ఏడాదికి ఉత్తమ చిత్రాన్ని గద్దర్ అవార్డుతో గౌరవించనున్నట్లు ప్రకటించారు. అదనంగా, ఈ అవార్డుల్లో తెలుగుతో పాటు ఉర్దూ సినిమాలకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించారు.
గౌరవ అవార్డులు, మార్పులు
గతంలో అందజేస్తున్న అవార్డుల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, పైడి జయరాజ్, కాంతారావుల పేరిట గౌరవ అవార్డులను అందజేయాలని నిర్ణయించారు. ఈ అవార్డులు సినీ పరిశ్రమలో విశేషమైన సేవలందించిన వారికి ప్రదానం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014 నుండి 2023 వరకు ఉత్తమ చిత్రాలను గుర్తించేందుకు ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టింది. ఈ అవార్డులు నంది అవార్డుల మాదిరిగా ఉండేలా గైడ్‌లైన్స్ రూపొందించారని దిల్ రాజు తెలిపారు.
2014 జూన్ 2 నుండి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన చిత్రాల నుండి ప్రతి ఏడాది ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి గద్దర్ అవార్డును అందజేయనున్నట్లు దిల్ రాజు తెలిపారు. అవార్డుల ఎంపికకు ఒక ప్రత్యేక జ్యూరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. వీరు మరో వారం రోజుల్లో ఉత్తమ చిత్రాలను ఖరారు చేయబోతన్నట్లు తెలిపారు. ఈ నిబంధనలను చిత్ర నిర్మాతలకు పంపి, అవార్డుల ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నారు.
ఇక ఏప్రిల్‌లో అవార్డుల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి, ప్రతిభను గుర్తించేందుకు ఈ అవార్డులు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో సింహా అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు చెల్లించిన రుసుమును తిరిగి ఇచ్చేందుకు ఎఫ్‌డీసీ సిద్ధమైంది. దీని కోసం ప్రత్యేక ప్రక్రియను అమలు చేయనున్నారు.
నెగెటివ్ ప్రచారాలపై
ఒక గొప్ప సినిమాపై 51% పాజిటివ్ స్పందన వస్తే అది విజయం సాధించినట్లే అని దిల్ రాజు పేర్కొన్నారు. ప్రతికూల ప్రచారాలను ప్రోత్సహించకుండా సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని సూచించారు. సినీ అవార్డులను ఎవరికైనా అందించే హక్కు ఉందని, ఫిల్మ్ ఛాంబర్ సహా ఇతర సంస్థలు కూడా అవార్డులను అందిస్తున్నాయని చెప్పారు.