ఆరు బ్రహ్మాస్త్రాల వంటి హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్..అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా హామీలను నెరవేరుస్తూ వస్తోంది. అలా ఇప్పటికే రెండు విడుతల్లో రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతులకు మరో తీపి కబురు చెప్పింది. ఇప్పటికే ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామన్న రేవంత్ సర్కార్ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.
ఆగస్ట్ 15లోగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. నెల రోజుల ముందే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసి చూపించారు. 32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు31 వేల కోట్ల రూపాయల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించి దేశంలోనే సరి కొత్త రికార్డు నెలకొల్పింది.
జులై 15న రుణమాఫీ జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. జీవీ జారీ చేసిన మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తూ వచ్చింది. జులై 18 న మొదటి విడతగా ఏకకాలంలో .. లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ రుణమాఫీ చేసింది. 11,14,412 మంది రైతులకు 6034.97 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
జులై 30న అసెంబ్లీ వేదికగా రేవంత్ సర్కార్ రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసింది. ఒక లక్ష నుంచి 1.50 లక్షల రూపాయల వరకు రుణమున్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. సుమారు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో 6190.01 కోట్లు రూపాయలను జమ చేసింది. కేవలం 12 రోజుల్లోనే సుమారు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు 12 వేల కోట్ల రూపాయలకు పైగా రుణమాఫీ నిధులు జమ చేయటమనేది తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి.
తాజాగా ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. మూడో విడత పంట రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. అమెరికా పర్యటన నుంచి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే.. ఖమ్మం జిల్లా వైరా మండలంలో రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొంటారు. మూడో విడతలో 1.50 లక్షల రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయనున్నారు. ఆ రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బులను జమ చేస్తారు.
దీంతో రుణమాఫీలో కీలక ఘట్టం ముగిసిపోయినట్లు అవుతుంది. 2 లక్షల రూపాయలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రుణమాఫీ విధి విధానాల్లో తెలంగాణలోని రైతులందరికీ ముందుగానే వెల్లడించింది.అయితే మొత్తంగా ఈ రుణమాఫీతో కొత్త రికార్డు క్రియేట్ చేసినట్లు అయింది.