ఇకనుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి: వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు

DCHS, District Collector, DMHOs, Harish Rao Video Conference, Harish Rao Video Conference with District Collector DMHOs, Health Minister, Health Minister Harish Rao Video Conference, Health Minister Harish Rao Video Conference with District Collector DMHOs, Mango News, Telangana Health Minister Harish Rao, Telangana New Health Minister Harish Rao

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షల మేరకు తెలంగాణను 100% కోవిడ్ వాక్సినేషన్ జరిగిన రాష్టంగా తీర్చిదిద్దుటకు హ్యాబిటేషన్స్, గ్రామాలు, మండలాలవారిగా లక్ష్యాలను నిర్దేశించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదేశించారు. శనివారం బి. ఆర్. కె. ఆర్. భవన్ నుంచి జిల్లా కలెక్టర్లు, డీఎంహెఛ్ఓలు, డీసీహెఛ్ లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.100% వాక్సినేషన్ తోనే కోవిడ్ ప్రభావం నుంచి పూర్తిగా భద్రత పొందగలుగుతామని పేర్కొన్నారు. వారం వారం సాధించిన లక్ష్యాలను సమీక్షించాలని స్పష్టం చేశారు. రాష్టంలో 18 సంవత్సరాలు పైబడిన ప్రజలు 2 కోట్ల 77 లక్షల మంది ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 43 లక్షల వాక్సిన్ డోసులు ఇచ్చినట్లు తెలిపారు. అందులో 2 కోట్ల 35 లక్షల మందికి మొదటి డోస్, 1 కోటి 8 లక్షల మందికి రెండవ డోస్ ఇచ్చినట్లు తెలిపారు. అర్హత కలిగిన 18.66 లక్షల మంది రెండవ డోస్ వేసుకొనేందుకు కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలకు రావాల్సి ఉందన్నారు. రాష్టంలో అర్హత కలిగినట్లు గుర్తించిన వారిలో 85% మంది మొదటి డోస్ వాక్సిన్ తీసుకున్నారని, మిగిలిన వారికి కూడా వాక్సినేషన్ చేయుటకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కోరారు. వాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయుటకు పంచాయతీ రాజ్, ఇతర శాఖల సహకారాన్ని తీసుకోవాలని మంత్రి సూచించారు.

కొత్తగా మంజూరు చేసిన 8 మెడికల్ కాలేజీల భవనాలను డిసెంబర్ లోపు పూర్తి చేయాలి: 

ఇక ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 8 మెడికల్ కాలేజీల భవనాలను డిసెంబర్ లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల పడకల సామర్థ్యమును పెంచాలని చెప్పారు. అలాగే విద్యార్థుల వసతికి అనువైన హాస్టల్ బిల్డింగ్స్ ను గుర్తించాలని తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పన, ఆధునిక పరికరాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. అయితే ఈ వసతులను సక్రమంగా వినియోగించుటకు అవసరమైన వైద్యులు, సిబ్బంది నియామక అధికారాలను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఇచ్చినట్లు తెలిపారు. ఏ ఆసుపత్రిలోనైనా ఉన్న పరికరాలు పూర్తిగా వాడే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 946 రకాల వైద్యసేవలు అందిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ఇకనుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి:

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కి అదనంగా ఆయుష్మాన్ భారత్ కింద 646 రకాల వైద్య సేవలను ప్రభుత్వం చేర్చిందని, వైద్యానికి సీఎం పెద్దపీట వేసినట్లు తెలిపారు. వైద్యానికి మరో 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని సీఎం తెలిపారన్నారు. తెలంగాణ డైయాగ్నోస్టిక్ సెంటర్స్ సేవలను ప్రజలకు అందించాలి, ఇకనుంచి ప్రభుత్వ ఆసుపత్రుల సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి. పిహెచ్సిల నుండి జిల్లా, మెడికల్ కాలేజీల వరకు తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాల్లో ఉన్న ప్రాథమిక, కమ్మ్యూనిటి, ఏరియా, జిల్లా ఆసుపత్రుల పనితీరును మెరుగుపరచి ప్రజలు విశ్వాసాన్ని చూరగొనెందుకు రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని జిల్లా కలెక్టర్లు, డీఎంహెఛ్ఓలు, డీసీహెఛ్ లను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఆసుపత్రుల్లో పేషెంట్స్ అక్యూపెన్సిని, సర్జరీలను సమీక్ష చేయాలి. అల్లోపతి వైద్యంతో పాటు ఇతర విభాగాల వైద్యుల పనితీరును సమీక్షించాలి.

ఆసుపత్రులకు మంజూరైన ఆక్సీజన్ ప్లాంట్ల పనులను పూర్తిచేయించాలని చెప్పారు. శానిటేషన్ పై కూడా శ్రద్ద చూపాలని సూచించారు. జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టంచేశారు. మలేరియా, టి.బి, లెప్రసి, బ్లైండ్ నెస్ నివారణ కార్యక్రమాలును కూడా సమీక్షించాలని తెలిపారు. జిల్లా పర్యటనల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీలు చేసి, సమీక్షలు జరుపనున్నట్లు మంత్రి తెలిపారు. ఆశా వర్కర్ నుండి హాస్పిటల్ సూపరింటెండెంట్ వరకు అందరి పనితీరును మానిటర్ చేయాలని చెప్పారు. ఇకనుంచి పనితీరును బట్టే పోస్టింగ్స్, ప్రోత్సాహకాలు వుంటాయని తెలిపారు. హాస్పిటల్స్ లో పేషెంట్స్ కు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించాలని చెప్పారు. జిల్లాల్లో ఉన్న ఆర్.బి.ఎస్.కె యూనిట్ల ను ఆక్టివేట్ చేయాలని మంత్రి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హెల్త్ సెక్రటరీ ఎస్ఏఎం రిజ్వి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి. శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి, ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ