హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న సంగతి తెలిసిందే. జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. బేగంబజార్‌లోని హోల్‌సేల్ కిరాణ దుకాణాలను జూన్ 28 (ఆదివారం) నుంచి జూలై 5వ తేదీ వరకు స్వచ్ఛంధంగా మూసివేస్తున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది. బేగంబజార్ నుంచి తెలంగాణ, ఏపీతో పాటుగా ఇతర రాష్ట్రాలకు కూడా కిరాణా వస్తువులను సరఫరా చేయబడతాయి.
నగరంలో కరోనా కేసులు పెరగడంతో పాటు, బేగంబజార్ మార్కెట్ పరిధిలోనే 15కు పైగా కరోనా కేసులు నమోదవడంతో మర్చంట్ అసోసియేషన్ సభ్యులు జూన్ 25, గురువారం నాడు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా ఆదివారం నుంచి జులై 5 వరకు పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని ఎవరైనా వ్యాపారులు పాటించకపోతే భారీ జరిమానా విధించాలని తీర్మానించారు. కేసుల తీవ్రత, పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అసోసియేషన్ ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu