
విశ్వనగరంగా ఎదిగిందని అంతా చెప్పుకునే హైదరాబాద్.. చైల్డ్ పోర్నోగ్రఫీ నేరాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. చైల్డ్ పోర్న్ వీడియోలను చూడటానికి అలవాటు పడ్డ వారిలో కొంతమంది వాటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తుండగా.. మరికొంతమంది మాత్రం వేర్వేరు సెర్చ్ ఇంజన్ల నుంచి చైల్డ్పోర్నోగ్రఫీకి చెందిన వీడియోలను సేకరించి మరీ వేర్వేరు ప్లాట్ ఫామ్‌లలో అప్లోడ్ చేస్తున్నారు.
ఈ వికృత చేష్టలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటున్నారన్న విషయాన్ని గమనించిన నిపుణులు షాక్ అవుతున్నారు. దీనిని అరికట్టటానికి నోడల్ ఏజన్సీగా వ్యవహరిస్తున్న వివిధ రాష్ట్రాల సీఐడీ శాఖ అంతర్జాతీయ సంస్థలు, టిప్‌లైన్ ద్వారా అందుతున్న ఫిర్యాదులతో.. పోలీసులు కేసులు నమోదు చేసి కొందరిని అరెస్టులు చేస్తున్నారు. అయినా కూడా ఈ తరహా నేరాలు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గుముఖం పట్టకపోవడం నిజంగా ఆందోళన కలిగించే విషయమే. టీనేజ్ వయసులో వాళ్లు అంతకంటే చిన్నవయసున్నవాళ్లు ఈ వీడియాలను చూడటానికి అలవాటు పడి క్రమంగా మానసిక రోగులుగా మారడమే కాకుండా ఇంకొందరు అయితే వీటి ప్రభావంతో నేరాలకు కూడా పాల్పడుతున్నట్లు తేలింది.
నిజానికి అందరికీ చౌకగా అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్‌ను సానుకూలంగా ఉపయోగించుకుంటున్న వారికంటే.. దానిని వినియోగించి దుర్వినియోగానికి వాడుతూ తప్పుడు దారులు పట్టినవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుంటున్న వారిలో 15 నుంచి 30 సంవత్సరాలలోపు వయసున్న వారే ఎక్కువమంది ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు వీళ్లల్లో చాలామంది పోర్న్ సైట్లు చూడటం మొదలుపెట్టి.. కొద్ది రోజుల్లోనే ఈ వీడియోలకు బానిసలుగా మారుతున్నారు. వీరిలో కొంతమంది చూడటంతోనే ఆగకుండా వేర్వేరు సైట్ల నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీకి చెందిన వీడియో క్లిప్పింగులను డౌన్లోడ్ చేసి మరీ.. తమ తమ వాట్సాప్, టెలిగ్రాం గ్రూపుల్లో స్నేహితులతో షేర్ చేసుకుంటున్నారు.
తాజాగా ఇలాంటి నేరానికి పాల్పడి అరెస్టయిన అంబర్ పేట నివాసి అయిన శ్రీనివాస్ ఎంసీఏ చదువుతూ.. వేర్వేరు సైట్ల నుంచి అశ్లీల వీడియోలను డౌన్లోడ్ చేసి వాటిని షేర్ చేయడం వల్ల చివరకు కటకటాల పాలయ్యాడు. ఆ తరువాత కొద్ది రోజులకే ఇంటర్నెట్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోల కోసం సెర్చ్ చేస్తూ.. కాచిగూడకు చెందిన ప్రశాంత్, తార్నాకకు చెందిన మహ్మద్ ఫిరోజ్ కూడా పోలీసుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే.అంతేకాదు చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు చూడటానికి అలవాటు పడుతూ కొంతమంది నేరాలకు కూడా పాల్పడుతున్నారు. వీరిలో పదిహేనేళ్ల వాళ్లతో పాటు యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న మగవాళ్లూ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోల్లో చూసినట్టుగానే తమ వికృత వాంఛలను తీర్చుకోవటానికి అభంశుభం తెలియని చిన్నారులను బలి చేస్తున్నారు.
తాజాగా బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ..ఏడేళ్ల బాలునిపై వరుసగా కొన్నిరోజులపాటు లైంగిక దాడి చేయటం ఇలాంటి నేరంగానే చూడొచ్చు. ఆ వ్యక్తి పెడుతున్న హింసను భరించలేకపోయిన బాబు.. చివరకు తల్లిదండ్రులకు విషయం చెప్పటంతో విషయం పోలీసుల వద్దకు వెళ్లింది. అంతేకాదు స్థానికులకు విషయం తెలిసి అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తికి దేహశుద్ది చేశారు. అంతేకాదు కొద్ది రోజుల క్రితం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పోర్న్ వీడియోలు చూడటానికి అలవాటుపడ్డ అయిదుమంది 10వ తరగతి విద్యార్థులు.. తమ సహ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన అప్పట్లో కలకలం రేపింది.
అందుకే ఇటువంటి నేరాలను అరికట్టటానికి తెలంగాణ సీఐడీ శాఖ నోడల్ ఏజన్సీగా పని చేస్తోంది. ఇంటర్నేషనల్ సంస్థలతో పాటు టిప్లైన్ల ద్వారా అందుతున్న సమాచారంతో కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేస్తూ వస్తోంది. అలా జనవరి నుంచి నవంబర్ వరకు చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి 31 కేసులు నమోదవగా..ఈ కేసుల్లో ఇప్పటి వరకూ 43 మందిని అరెస్టు కూడా చేశారు. ఎవరైనా సరే ఇంటర్నెట్‌లోకి వెళ్లి చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోల కోసం వెతికినా.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినా అన్ని వివరాలు ఎన్సీఆర్బీలోని ప్రత్యేక వింగ్‌లో నమోదవుతూ ఉంటాయి.ఇలా వేర్వేరు మెట్రోపాలిటన్ సిటీల్లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి నమోదైన కేసులను గమనిస్తే హైదరాబాద్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద నమోదైన కేసులు 52 ఉండగా వాటిలో 22 కేసులు హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE