హైదరాబాద్‌లో కొన్నాళ్లుగా మెట్రో రైల్ ప్రాజెక్ట్ వార్తలు వింటున్నాం. మెట్రో రైలు రెండో దశలో ఒకటి చాంద్రాయణగుట్టలో కాగా.. మరొకటి ఎల్బీనగర్‌లో ఇంటర్‌ఛేంజ్ స్టేషన్లు రానున్నాయి. అయితే ఈ రెండుచోట్ల కూడా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు ఉండటం ఇప్పుడు మెట్రో అధికారులకు పెద్ద సవాలుగా మారుతోంది. మెట్రోరైలు తొలిదశలో నిర్మించిన అమీర్‌పేట అతిపెద్ద జంక్షన్‌గా ఉంది. ఈ మెట్రో స్టేషన్ నిత్యం ప్రయాణికుల రాకపోకలతో కిటకిటలాడుతూనే ఉంటుంది. కారిడార్-1, 3 అమీర్ పేట్ మెట్ర స్టేషన్లో కలుస్తుంటాయి.
ఇక ఎంజీబీఎస్‌లో ఉన్న మరో మెట్రో స్టేషన్ జంక్షన్ ఉండగా..ఇక్కడ దిగి కారిడార్-1, 2లోకి మారిపోవచ్చు.అలాగే పరేడ్ గ్రౌండ్ వద్ద మరో జంక్షన్ ఉండగా… ఇక్కడ వేర్వేరు మార్గాలు రెండు వేర్వేరు స్టేషన్లు ఉన్నాయి. ఇలా మొత్తం మూడు కారిడార్లలో మూడు ఇంటర్‌ఛేంజ్ స్టేషన్లను నిర్మించారు. ఇదే విధంగా త్వరలో ప్రారంభం కానున్న రెండోదశలోనూ రెండు ఇంటర్ చేంజ్ స్టేషన్లు ఉండబోతున్నాయి.
ఎల్బీనగర్‌లో… నాగోల్ నుంచి విమానాశ్రయం వెళ్లే మార్గంలో ఒకటి, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ కారిడార్‌కు సంబంధించి ఎల్బీనగర్‌లో మరో ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ ఉంటుంది. ఇప్పటికే ఎల్బీనగర్‌లో స్టేషన్ ఉండటంతో విమానాశ్రయ మార్గంలో మరో స్టేషన్‌ను నిర్మించి రెండిటికి కలిపే చేసే అవకాశం ఉంది. దీని కోసం ఎస్కలేటర్ మాదిరి వాకలేటర్ సదుపాయాన్ని కల్పించడానికి అధికారులు రెడీ అయ్యారు. అయితే ఇక్కడ సర్కిల్‌లో ఫ్లైఒవర్, అండర్‌పాస్‌లు ఉండటంతోనే ఇప్పుడు అధికారులు ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఆలోచిస్తున్నారు.
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు, నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గం చాంద్రాయణగుట్ట వద్ద కలుసుకోబోతున్నాయి. ఇక్కడే అమీర్‌పేట లాగే ఒక భారీ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌ను నిర్మిస్తారు. ఇక్కడ కూడా సర్కిల్‌లో ఫ్లైఓవర్ ఉండటంతో..మెట్రో అలైన్‌మెంట్‌కు ఇది సవాల్‌గా ఉంది. ఫస్ట్ స్టేజ్ మెట్రో మార్గంలో పరేడ్‌గ్రౌండ్ వద్ద ఇలాంటి సవాళ్లు ఎదురవగా..దీని కోసం అక్కడ వేర్వేరు స్టేషన్లను నిర్మించి మెట్రో మార్గాలను జాయింట్ చేశారు. మరి సెకండ్ స్టేజ్‌లో దీనిని ఎలా పూర్తి చేస్తారనేది వేచి చూడాలి.