తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో.. ఉత్సాహంగా హస్తినకు వెళ్లిన కాషాయ నేతలు అనుకున్నది ఒకటి అయినది ఒకటి జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతం అవుతుందని దీనిపై ఢిల్లీ పెద్దలు ప్రశంసలు కురుస్తాయని వెళ్లిన వాళ్లకు..రివర్స్‌లో అమిత్ షా గట్టిగా క్లాస్ తీసుకోవడంతో నేతలంతా కంగుతిన్నారట. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై తెలగాణ బీజేపీ విధానాన్ని అమిత్ షా ఎండగట్టారట. ఈ అంశంలో కేంద్ర పార్టీ విధానం ఏంటి? తెలంగాణ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఏంటని గట్టిగా నిలదీశారట. దీంతో తాము పార్టీ పరంగా చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి టీబీజేపీ నేతలు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తుండటంతో.. ఇది కాస్తా రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అవును బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లుపై ఇప్పటి వరకూ ఓకే అన్న తెలంగాణ బీజేపీ నేతలంతా..ఇప్పుడు రివర్స్ గేర్ వేశారు. అయితే ఇప్పటికే ఈ బిల్లు ఇటు శాసన సభలోను, అటు శాసన మండలిలోనూ ఆమోదం పొందింది. ఇప్పటి వరకూ విద్య ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో బీసీలకు అమల్లో ఉన్న 29 శాతం రిజర్వేషన్లను.. 42 శాతానికి పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని కోసం తెలంగాణ వ్యాప్తంగా కుల గణనను కూడా నిర్వహించింది. ఈ గణనలో తెలంగాణలో 56.36 శాతం మంది బీసీలు ఉన్నట్లు తేలింది.
దీంతోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా..అప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలిపారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించదంటూ కొంతమంది నేతలు ప్రచారం చేస్తున్నాయని.. అది తప్పుడు ప్రచారమని తాము బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతోనే తేలిందని .. అసెంబ్లీలో బీసీ రిజర్వషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గుర్తు చేశారు. అయితే తాజాగా వీరందరికీ కేంద్ర పెద్దలు దీనిపై మొట్టికాయలు వేయడంతో నాలుక కరుచుకుని మాట మారుస్తున్నారు.
అయితే బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్ బిల్లుపై తమ వైఖరి మార్చుకోవడం వెనుక అమిత్ షా ఎఫెక్ట్ ఉందని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీ నేతలపై అమిత్ షా చీవాట్లు వేయడంతో.. ముస్లింలను కూడా బీసీల్లో కలిపి రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ బిల్లు రూపొందించడం తప్పంటూ కొత్త వాదనను తెరమీదకు తీసుకువస్తూ తెలంగాణ బీజేపీ నేతలంతా తమ అభ్యంతరాన్ని తెలుపుతున్నారు.