కులగణన సర్వే తర్వాత.. దాని పూర్తి నివేదికను అందజేయడానికి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లి. కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీని కలవాలి. కానీ హఠాత్తుగా రేవంత్ రెడ్డి హఠాత్తుగా.. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ భేటీ ఉందని ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. రేవంత్ అంత అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే చర్చ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సాగుతుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఈ భేటీ జరిగింది. త్వరలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల ప్రభుత్వం కులగణన, ఎస్సీ వర్గీకరణను చేపట్టడంతో.. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు రచించాలనే విషయాలపైన ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది.
అయితే పైకి ఈ కారణాలు కనిపిస్తున్నా కూడా వేరే కారణాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో మంత్రుల అవినీతి వల్ల ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారని..దీని వల్లేవారు భేటీ అయ్యారని ప్రచారం జోరుగా జరిగింది. ఈ పరిణామం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడంతో.. రేవంత్ రెడ్డి అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించడానికే ఇప్పుడు రంగంలోకి దిగినట్టు టాక్ నడుస్తోంది. దీంతోనే ప్రధానంగా సీ ఎల్పీ భేటీలో అసంతృప్త ఎమ్మెల్యేల పైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వం చేసిన కుల గణన సర్వేపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. గణన నివేదికను తగలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ పరిణామాలు ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారడంతో.. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కుల గణన సర్వే, బడ్జెట్ వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను కూడా బలోపేతం చేసే విషయంపైన చర్చించినట్టు తెలుస్తోంది.