బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, కవిత, పద్మారావు, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్ హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, అసెంబ్లీ వ్యూహంపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 10న హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ ప్రతినిధుల సమావేశం జరగనుంది. సిల్వర్ జూబ్లీ పేరుతో హైదరాబాద్ లేదా వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఈసారి కేసీఆర్ హాజరయ్యే అవకాశముంది. గత సమావేశాల్లో ఒక్కరోజే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్, ఈసారి దమ్ముంటే అసెంబ్లీలో మాట్లాడాలంటూ కాంగ్రెస్ సవాళ్లు విసురుతోందని, అందుకే ఆయన పాల్గొంటారని అంటున్నారు బీఆర్ఎస్ వర్గాలు. ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం, అప్పుల అంశాలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగడతారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల ఓటమి తర్వాత కేసీఆర్ ఎక్కువగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్‌లో కేవలం మూడుసార్లు మాత్రమే సమావేశాలు జరిపారు. ఇటీవల జరిగిన సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించిన కేసీఆర్, ఇప్పుడు పార్టీ భవిష్యత్తు వ్యూహంపై చర్చించేందుకు కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల ఎంపిక, పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచే అంశాలపై సమీక్షించనున్నట్లు సమాచారం. ఫామ్‌హౌస్‌ను వీడి తిరిగి రాజకీయంగా క్రియాశీలం కానున్నట్లు సూచిస్తూ, బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర “కేసీఆర్ కమింగ్ సూన్” అనే వీడియోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో, బీఆర్‌ఎస్ భవిష్యత్తు కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ వ్యూహం, బహిరంగ సభ తేదీ, ప్రదేశం వంటి అంశాలపై త్వరలో స్పష్టత రానుంది.