ఖ‌మ్మం కాంగ్రెస్‌మ‌యం కావాల్సిందే..!

Khammam, Congress, Lok sabha elections, Ponguleti srinivasarao, Khammam Assembly seat, BRS candidate, 2024 assembly polls, P Srinivas Reddy, Badrachalam, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News, Telangana Political Updates, Mango News Telugu, Mango News

అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు ప్ర‌స్తుత మంత్రులు.. నాటి కాంగ్రెస్ అభ్య‌ర్థులు పొంగులేటి శ్రీ‌నివాస రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ప్ర‌తిప‌క్ష పార్టీ బీఆర్ ఎస్ కు చేసిన చాలెంజ్‌లు గుర్తుండే ఉంటాయి. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ ఎస్ అభ్య‌ర్థిని కూడా అసెంబ్లీ గేటు తాక‌నీయ‌బోమ‌ని ప్ర‌క‌టించారు. చెప్పిన‌ట్లుగానే 99 శాతం విజ‌యం సాధించారు. ప‌ది సీట్ల‌లో ఒక్క‌చోట మాత్రం బీఆర్ ఎస్ అభ్య‌ర్థి గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పార్టీలో కీల‌క వ్య‌క్తులుగా ముద్ర‌ప‌డ్డ ఆ ఇద్ద‌రూ అమాత్యులు అయ్యారు. అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసి రెండు నెల‌లు కావ‌స్తోంది. ప్ర‌భుత్వం ఇంకా ఆర్థికంగా నిల‌దొక్కుకునే ప‌నిలో ఉంది. అదిలా ఉండ‌గానే.. స్థానిక సంస్థ‌లు, వ్య‌వ‌సాయ ప‌ర‌పతి సంఘాలు.. ఇలా ఎక్క‌డ చూసినా కాంగ్రెస్ జెండానే క‌నిపించేలా ఎక్క‌డిక‌క్క‌డ రాజకీయాలు న‌డుస్తున్నాయి.

రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అవిశ్వాసాలు న‌డుస్తున్నాయి. ఇదే క్ర‌మంలో ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు కూడా కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క‌టి మినహా.. ప‌ది  నియోజ‌క‌వ‌ర్గాల్లో 9 కాంగ్రెస్ కూట‌మే కైవ‌సం చేసుకుంది. 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ హవా సాగించగా, సీపీఐ తో పొత్తు పెట్టుకున్న కొత్తగూడెం స్థానంలోనూ సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు జయకేతనం ఎగురవేశారు. దీంతో మొత్తం పది స్థానాల్లో 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీని నమోదు చేసింది. గెల‌వ‌డ‌మే కాదు.. దాదాపు ప్రతి ఒక్కరికీ 20 వేల పైచిలుకు మెజారిటీనే రావడం గమనార్హం. పాలేరులో పోటీ చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 57,231 ఓట్ల మెజారిటీ సాధించి జిల్లాలో అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా రికార్డుకెక్కారు. కేవలం భద్రాచలం నియోజకవర్గం లోని టిఆర్ఎస్ పార్టీ గెలుపొందింది ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రముఖ వైద్యుడు తెల్ల వెంకటరావు 6,319 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి పొడెం వీరయ్యపై గెలిచారు.

మిగ‌తా ఖమ్మం (తుమ్మల నాగేశ్వరావు), పాలేరు (పొంగులేటి శ్రీనివాసరెడ్డి), మధిర (మల్లు భట్టి విక్రమార్క), సత్తుపల్లి (మట్టా రాఘమయి), వైరా (రాందాస్ నాయక్), అశ్వారావుపేట (జారే అదినారాయణ), పినపాక (పాయం వెంకటేశ్వర్లు), ఇల్లెందు (కోరం కనకయ్య) నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులే గెలుపొందారు. ఇప్పుడు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మంలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవులు ‘హస్త’గతం కాబోతున్నాయి. ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌పై ఉన్న అసంతృప్తిని, గత డీసీఎంఎస్‌ చైర్మన్‌ కారు రుణం చెల్లించకపోవడతో డిఫాల్టర్‌గా ఉండడాన్ని గమనించి… తుమ్మల మంత్రి పదవి చేపట్టగానే వ్యూహాత్మకంగా సహకార రంగానికి చెందిన ఈ రెండు పదవులను కాంగ్రెస్‌ పరం చేసేందుకు నిబంధనలకు అనుగుణంగా వ్యూహం రచించారు. బీఆర్‌ఎస్‌ నేత రాయల శేషగిరిరావు కారు రుణ బకాయి చెల్లించకుండా డిఫాల్టర్‌గా ఉండడంతో ఆయనపై ఫిర్యాదులు వచ్చి విచారణ జరిగింది. ఆయన తల్లాడ మండలం గంగదేవిపాడు సొసైటీ డైరెక్టర్‌, చైర్మన్‌ పదవులతో పాటు డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవి కూడా కోల్పోయారు. ఆయన స్థానంలో డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌గా ఉన్న కొత్వాల శ్రీనివాసరావును నియమించారు.

గతంలో బీఆర్‌ఎస్‌లో ఉన్న కొత్వాల అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఇప్పుడు ఆయనకు కాలం కలిసివచ్చింది. నోటిఫికేషన్‌ ద్వారా పూర్తిస్థాయి చైర్మన్‌గా కూడా ఆయనను ఎన్నుకునే అవకాశం ఉంది. ఇక బీఆర్‌ఎస్‌లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అనుచరుడిగా ఉన్న డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషయ్య విషయంలోనూ వ్యూహాత్మకంగా అవిశ్వాస అస్త్రం ప్రయోగించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెం సొసైటీలో కూరాకులపై డైరెక్టర్లలో తీవ్ర వ్యతిరేకత ఉండడం అవిశ్వాసానికి దారి తీసింది. మొత్తం 13 మంది డైరెక్టర్లలో 11 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. అయితే కూరాకుల హైకోర్టుకు వెళ్లడం, కోర్టు ఆదేశాలతో ఓటింగ్‌ ఫలితాన్ని ఈ నెల 30 వరకు ప్రకటించకుండా ఆపారు. ఓటింగ్‌ వివరాలను కోర్టుకు నివేదించారు. అవిశ్వాసానికి అనుకూలంగా 11 మంది డైరెక్టర్లు ఓటు వేయడంతో కూరాకుల పదవి కోల్పోయే అవకాశం ఉంది. దీంతో డీసీసీబీ చైర్మన్‌ పదవి కూడా త్వరలో కాంగ్రెస్‌ పరం కాబోతోంది. వైస్‌చైర్మన్‌గా ఉన్న దొండపాటి వెంకటేశ్వరరావుకు తాత్కాలికంగా బాధ్యతలు ఇచ్చినా ఆ తర్వాత నోటిఫికేషన్‌ ఇచ్చి కాంగ్రెస్‌కు చెందిన డైరెక్టర్లలో ఒకర్ని ఎన్నిక చేసే అవకాశం ఉంది.

అలాగే.. మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌వేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్ర‌ముఖులు. ఇప్ప‌టికే పంచాయితీల కాలం ముగిసింది. ప్ర‌త్యేకాధికారుల పాల‌న మొద‌లైంది. ఎన్నిక‌లు జ‌రిగితే స‌ర్పంచ్ లు కూడా కాంగ్రెస్ సానుభూతిప‌రులే ఉండేలా పార్టీ ఖ‌మ్మం నేత‌లు స‌మాలోచ‌న‌లు ప్రారంభించారు. ఇలా.. అసెంబ్లీలోనే కాదు.. స్థానిక సంస్థ‌ల్లోనూ కాంగ్రెస్ మాత్ర‌మే ప్రాతినిధ్యం వ‌హించేలా కీల‌క నేత‌లు చ‌క్రం తిప్పుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ