గత అయిదేళ్లు ఏపీలో అధికారం లేకపోవడంతో టీడీపీ హైకమాండ్ తెలంగాణపై ఫోకస్ తగ్గించింది. కంప్లీట్‌గా ఏపీపైనే ఫోకస్ పెట్టింది. అక్కడ తిరిగి అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు ఏపీలో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. తిరిగి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇప్పుడు ఏపీలో అధికారంలోకి రావడంతో.. తిరిగి తెలంగాణపై దృష్టి పెట్టారు. తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాలని.. మళ్లీ పసుపు జెండాను రెపరెపలాడించాలని చూస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కూడా అదే విషయాన్ని వెల్లడించారు.
వాస్తవానికి తెలుగు దేశం పార్టీకి తెలంగాణలో పెద్ద లీడర్లే ఉన్నారు. కానీ గతంలో ఇక్కడ టీడీపీ ఉణికి ప్రశ్నార్థకంగా మారడంతో.. వారు దిక్కుతోచని పరిస్థితిలో ఇతర పార్టీల్లోకి వెళ్లారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న కీలక నేతలంతా తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చిన వారే. అలాగే తెలంగాణలో టీడీపీ కేడర్ కూడా అలాగే ఉంది. ఇటీవల చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కార్యకర్తలు.. అభిమానులు తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో ఆ మార్గం మొత్తం పసుపు మయం అయిపోయింది. ఈక్రమంలో తెలంగాణలో తిరిగి పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
అయితే ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ బలపడితే అది బీఆర్ఎస్ పార్టీకే లాభమని వెల్లడించారు. అలాగే తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఏపీలో తాము బీఆర్ఎస్ పెట్టినప్పుడు.. తెలంగాణలో వారు టీడీపీని బలోపేతం చేస్తామని అనడంలో తప్పులేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఎన్డీయే ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారని.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి దోహద పడాలని వెల్లడించారు. ఈ విధంగా తెలంగాణకు మేలు జరగడంలో ఆయన పాత్ర ఉపయోగపడితే స్వాగతిస్తామని కేటీఆర్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE