తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బీర్ల ధరలు పెంచిన తెలంగాణ సర్కార్.. తాజాగా ఇతర లిక్కర్ ధరలు కూడా పెంచడానికి సమాయత్తమవుతోంది. అయితే పేద, బడుగు వర్గాలు ఎక్కువగా తీసుకునే.. చిఫ్ లిక్కర్ ధరలో ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తోంది.బ్రాండెడ్ లిక్కర్ ధరలపైనే కాస్త పెంపు ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం లిక్కర్ ధరల పెంపు అంశంపై మదింపు జరుగుతుంది. ఎంఆర్పీ ధర ఆధారంగా ధర పెంపు ఉంటుంది. లిక్కర్ బాటిల్ రేటు 500 రూపాయల కంటే ఎక్కువ ఉన్న లిక్కర్‌పైన కనీసం 10 శాతం పెంచాలనేది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. రెండు, మూడు రకాల బ్రాండెడ్ లిక్కర్ ధరల పెంపు ప్రపోజల్స్ ను ..ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందు అధికారులు ఉంచనున్నారని…దాని వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎంత ఆదాయం సమకూరుతుందో కూడా ప్రజెంటేషన్ ఇస్తారు. వాటిపైన కాంగ్రెస్ ప్రభుత్వం రివ్యూ చేసి.. ఫైనల్‌గా నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. లిక్కర్‌పై రేట్ల పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాకి ఏడాదికి 2000 కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో ఫిబ్రవరి నెలలోనే బీర్ల రేట్లు పెరిగిన విషయం తెలిసిందే.సుమారు 15 శాతం వరకు రేట్లు పెంచడంతో..ఒక్కో బీరుపై సగటున 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ధర పెరిగింది. గతంతో పోలిస్తే ముడి సరుకుల ధరలు పెరగడంతో… తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత బీర్ల ధరల పెంపు నిర్ణయాన్న తీసుకుంది. లిక్కర్ సప్లై చేసే కంపెనీల నుంచి విజ్ఞప్తులతో పాటు.. పక్క రాష్ట్రాల్లో ధరలపై రీసెర్చ్ చేసిన కమిటీ..రేవంత్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడంతో 15 శాతం ధరలు పెంచుకోవచ్చని చెప్పింది. కాగా మరోసారి మద్యం ధరలు పెంపు ఆలోచన మందుబాబులకు కాస్త కష్టంగానే ఉండొచ్చు.