తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ ఈరోజు (శుక్రవారం) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన చేత మంత్రిగా ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరై, అజారుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలిపి మంత్రివర్గంలోకి ఆహ్వానం పలికారు.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు మంత్రి పదవి దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
తనకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని ధీమా వ్యక్తం చేసిన అజార్, తన మంత్రి పదవికి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధం లేదని స్పష్టం చేస్తూ, ఈ రెండింటిని వేరువేరుగా చూడాలని ప్రజలను కోరారు. చివరగా, తనకు ఏ శాఖ అప్పగించినా న్యాయం చేస్తానని ఆయన తెలియజేశారు.
కాగా, రాష్ట్రంలో మంత్రివర్గం ఏర్పడినప్పుడల్లా ముస్లిం మైనారిటీలకు ఒక మంత్రి పదవిని కేటాయించడం ఆనవాయితీగా ఉంది. అయితే, ఈసారి కాంగ్రెస్ తరఫున మైనారిటీ వర్గానికి చెందిన అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేకపోయారు. ఈ నేపథ్యంలో, మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో పార్టీ అధిష్ఠానం అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకుంది.
అయితే, ప్రస్తుతం అజారుద్దీన్ శాసనసభలో లేదా శాసన మండలిలో సభ్యులు కానందున, ఆయన ఆరు నెలల్లోగా చట్టసభల్లో సభ్యత్వం పొందాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తుంది. ఇక తాజా ప్రమాణ స్వీకారంతో తెలంగాణ కేబినెట్ బలం 16కు చేరింది. ముఖ్యమంత్రి సహా మంత్రివర్గంలో మొత్తం 18 మందికి అవకాశం ఉండగా, ఇంకా రెండు మంత్రి బెర్తులు ఖాళీగా ఉన్నాయి.
 
			 
		





































