సిరిసిల్లను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం – మంత్రి కేటిఆర్

KTR On Sircilla Constituency Development Works, Minister KTR, Minister KTR Latest News, Minister KTR Review Meeting, Minister KTR Review Meeting on Sircilla Constituency, Sircilla Constituency Development, Sircilla Constituency Development Works, Sircilla Development Works

కరోనా పరిస్ధితుల నేపథ్యంలో ప్రజారోగ్య సేవలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల మంత్రి కేటిఆర్ సిరిసిల్ల జిల్లా యంత్రాంగానికి సూచించారు. దీంతో పాటుగా సిరిసిల్ల పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ దిశగా అవసరం అయిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ దిశగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులపైన కూడా మంత్రి సమీక్షించారు. సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ది పనులు మరింత వేగంగా పరుగులెత్తించాలని మంత్రి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈరోజు జిల్లా అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో నియోజకవర్గంలో జరుతున్న సాగునీటి ప్రాజెక్టులు, ఇతర అభివృద్ది పనులుపైన పురోగతిపైన వివరాలు తెలుసుకున్నారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి మంచి కాలం కలిసి వచ్చిందని, సరిపోయిన మేరకు వర్షాలు కురిసాయని అన్నారు. దాదాపు సిరిసిల్లలోని అన్ని చెరువులు నిండాయని, మంచి పంటలు వచ్చే అవకాశం ఉన్నదన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు పనులను సాగునీటి శాఖ ఈఏన్సి, ఇతర ఉన్నతాధికారులు, వర్కింగ్ ఎజెన్సీలతో కలిపి సమీక్షించారు. పనులను మరింత వేగంగా జరిగేలా చూడాలని మంత్రి వారిని అదేశించారు.

జిల్లాలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్ధితులపైన కూడా జిల్లా వైద్య శాఖాధికారులతో మంత్రి కేటిఆర్ సమీక్షించారు. జిల్లాలో ఉన్న కరోనా బాధితులు ఎంతమంది, వారికి అందుతున్న సేవలు, వారికి కేటాయించిన ఐసోలేషన్ సౌకర్యాలు, వైద్య చికిత్స సౌకర్యాలపైన మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా కోసం ఉపయోగిస్తున్న మందులు, మాస్కులు, పిపిఈ కిట్లతో పాటు బాధితులకు అందుతున్న ఆక్సిజన్ సౌకర్యం వంటి వాటిపైన వివరాలు తెలుసుకున్నారు. వీటికి సంబంధించి రెమ్ డెసివిర్, ప్లావిపిరావిర్ వంటి మందులను అందిస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో చేస్తున్న టెస్టింగ్ జరుగుతున్న విధానం, టెస్టింగ్ కేంద్రాలు, టెస్టింగ్ కిట్ల సంఖ్య వంటి వివరాలు తెలుసుకున్నారు. కరోనా విషయంలో ప్రస్తుతం జిల్లాలో అందిస్తున్న సేవల పట్ల ఎలాంటి ఇబ్బందులు లేవని జిల్లా అధికారులు మంత్రికి తెలిపారు. క్లస్టర్ అసుపత్రులపైన మరింత దృష్టి పెట్టాలని సూచించారు. ఏల్లారెడ్డిపేట, వీర్నపల్లి, బండలింగంపల్లి పిహెచ్సిల ఏర్పాటుపైన వేగంగా ముందుకు కదలాలని సూచించారు. నర్సింగ్ కాలేజీ పనులపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సిరిసిల్ల పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి అన్నారు. ఈ దిశగా అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు. పట్టణంలో కొనసాగుతున్న పనులను ఈ సమావేశంలో సమీక్షించారు. వీలీన గ్రామాల్లోనూ అభివృద్ది కార్యక్రమాలు వేగంగా కొనసాగేలా చూడాలన్నారు. పట్టణాన్ని సందర్శించి పట్టణ పురోగతి పనులను సమీక్షించాలని సిడిఏంఏ సత్యనారాయణను అదేశించారు. జిల్లా కలెక్టరెట్ భవన నిర్మాణ పనులను ఈ సమావేశంలో సమీక్షించారు. జిల్లాలో రైతు వేదికల నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 154 గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రకృతి వనాల పనులు జరుగుతున్న తీరుని మంత్రి కేటిఆర్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్, మున్సిపల్ శాఖా ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు హజరయ్యారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu