తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందని, అలాగే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారని పేర్కొన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు చెప్తున్నట్లు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రతిపక్షాలు ఇటీవల చేయించుకున్న సర్వేల్లో కూడా టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని తేలిందని, అలాగే తాము చేయించుకున్న సర్వేలో టీఆర్ఎస్ పార్టీకి 90కి పైగా స్థానాలు వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.
షెడ్యూల్ ప్రకారమే 2023లో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసిన కేటీఆర్, ఒకవేళ బీజేపీ తేదీ ప్రకటిస్తే అసెంబ్లీ రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మా పార్టీలో ఉన్న విభేదాలే మా బలానికి నిదర్శనమన్న ఆయన, పార్టీ చేరికలపై తాము ఎవరినీ బలవంతం చేయడంలేదని, పరిస్థితులకనుగుణంగా బలంగా ఉన్న నేతలను పార్టీ కలుపుకొని పోతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు దశాబ్దాల తరబడి పాలించినా దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురాలేక పోయాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో సిరిసిల్ల పర్యటనకు రావొచ్చన్న వార్తలపై స్పందిస్తూ.. రాహుల్ నిజంగా వస్తే స్వాగతిస్తామని, రెండు రోజులు ఉండి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడాలని కోరుకుంటున్నానని తెలిపారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని, అలాగే ధరణి సమస్యలను కూడా పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ