విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కార్మికులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్ధతు తెలుపుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే సీఎం కేసీఆర్ అనుమతితో విశాఖ వెళ్లి మద్దతిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
విశాఖలో పోరాడి సాధించుకున్న ఉక్కు పరిశ్రమలో వంద శాతం పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. ఇలాగే ఉంటే ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ, రేపు బీహెచ్‌ఈఎల్, ఎల్లుండి సింగరేణి అమ్ముతానంటారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేటుపరం చేసేందుకు వెనుకాడరని విమర్శించారు. ఉక్కు పరిశ్రమకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమానికి మద్దతిస్తాం, అయితే తెలంగాణలో ప్రభుత్వ సంస్థల విషయంలో సమస్యలొస్తే వారు కూడా మాతో కలిసిరావాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రైవేటీకరణపై ఏపీలో ఉద్యమం ఉధృతమవుతున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా మద్ధతు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ