టిఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్స్, కొరియర్ సేవలు ప్రారంభం

Minister Puvvada Ajay Kumar, Minister Puvvada Ajay Kumar Launches TSRTC Parcel, Telangana Transport Minister, Transport Minister, TSRTC, TSRTC Cargo Services, TSRTC Courier Services, TSRTC Latest News, TSRTC rolls out cargo services, TSRTC Updates

టిఎస్ ఆర్టీసీ పార్శిల్స్, కొరియర్, కార్గో సర్వీసు సేవలను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జూన్ 19, శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ లోని ట్రాన్స్ పోర్ట్ భవన్లో ప్రారంభించారు. ఆర్టీసీలో కార్గో, పార్శిల్స్‌, కొరియ‌ర్‌ సేవలను విస్తృత పరిచేందుకు అవసరమైన వ్యూహం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించినట్లే, అన్ని చోట్లకూ సరుకు రవాణా చేయాలని చెప్ప‌డంతో ఆ దిశ‌గా సేవ‌ల్ని అందుబాటులోకి తీసుకురావ‌డం జ‌రిగింద‌ని మంత్రి పువ్వాడ అజ‌య్ తెలిపారు.

పార్శిల్స్‌, కొరియ‌ర్‌ సేవ‌ల వివ‌రాలు, సంస్థ‌లో చేప‌ట్టిన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌కు సంబంధించిన విష‌యాల‌తో రూపొందించిన‌ క‌ర‌పత్రాన్ని ఈ సందర్భంగా ఆవిష్క‌రించారు. “వేగంగా, భ‌ద్రంగా.. మీకు చేరువ‌గా..” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ, సంస్థ సమకూర్చుకోవల్సిన ఆదాయ వనరులతో పాటు పార్శిల్స్ రవాణాకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన విధి విధానాల తీరుతెన్నులను వివరించారు. ప్రజా రవాణాలో ప్రత్యేక గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తూనే సంస్థ ఆర్థికంగా బలపడేందుకు పలు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తోందన్నారు.

కోవిడ్-19 లాక్ డౌన్ ప‌రిస్థితుల్లో ఆర్టీసీ ఆదాయం పూర్తిగా లేక‌పోవ‌డం, ఆపై లాక్ డౌన్ స‌డ‌లింపుల త‌రువాత‌ కూడా ప్ర‌యాణీకుల సంఖ్య పుంజుకోక‌పోవ‌డంతో సంస్థ ఆదాయం గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయిందన్నారు. ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో ఆదాయం మ‌రింత సంపాదించ‌డం ద్వారా విప‌త్క‌ర ప‌రిస్థితుల్ని అధిగ‌మించ‌డానికి ఆర్టీసీ పూనుకుందన్నారు. వాటిలో ముఖ్య మార్గంగా ఈ పార్శిల్, కొరియ‌ర్‌, కార్గో స‌ర్వీసు (పి.సి.సి) సేవ‌లు తోడ్ప‌డ‌నున్నాయ‌ని చెప్పారు. అన్ని బ‌స్‌స్టేష‌న్ల‌లో సంస్థ ఉద్యోగుల‌చే ఈ పి.సి.సి సెంట‌ర్లు నిర్వ‌హించ‌నున్నామ‌ని, తొలి ద‌శ‌లో 104 కార్గో బ‌స్సుల‌ సేవ‌లు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. పార్సిల్స్ బుకింగ్స్ కోసం ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వేతర సంస్థలు, ప్రైవేట్ కంపెనీలను సంప్రదించి సేవల్ని విస్తరించనున్నట్లు చెప్పారు.

ప్ర‌స్తుతం వ్యాపార లావాదేవీలు చాలా వ‌ర‌కు ఈ కామ‌ర్స్ ద్వారా న‌డుస్తున్నాయి, ఆర్టీసీ స‌ర్వీసు ప్ర‌తి గ్రామానికి ఉండ‌టంతో ఈ రంగంలో ఈ-కామ‌ర్స్ కంపెనీల‌కు పార్శిల్స్ అందించ‌డంలో మ‌రింత న‌మ్మ‌కంగా సేవ‌లు అందించ‌డానికి ప్ర‌ణాళిక త‌యారు చేయ‌డం జ‌రుగుతుందని, త‌ద్వారా ఈ-కామ‌ర్స్ రంగం అభివృద్ధితో పాటు ఆర్టీసీకి అద‌న‌పు ఆదాయం స‌మ‌కూరుతుందని తెలిపారు. మొద‌ట విడ‌త‌గా 140 బ‌స్‌స్టేష‌న్ల నుంచి అంటే ప్ర‌స్తుతం బ‌స్‌స్టేష‌న్ నుంచి బ‌స్‌స్టేష‌న్ వ‌ర‌కు ఈ సేవ‌లు అందించడం జ‌రుగుతోందని, వినియోగ‌దారులు చిన్న‌పాటి క‌వ‌ర్ల‌తో పాటు పార్శిల్స్‌, కొరియర్ సేవ‌ల‌ను సులభంగా బుక్ చేసుకోవడానికి మొబైల్ అప్లికేషన్ కూడా త్వరలో అందుబాటులోకి రానున్న‌దని వెల్ల‌డించారు. నష్టాల్లో ఉన్న సంస్థకు ఇదొక ఆదాయ మార్గంగా భావిస్తూ ఈ సేవల్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజ‌య్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu