ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని ఆమె నివాసంలో ఆదివారం ఉదయం 11 గంటలకు రాఘవేంద్ర వస్త నేతృత్వంలోని ఐదుగురు సీబీఐ అధికారుల బృందం ఆమెను విచారించింది. అయితే ఈ కేసులో సెక్షన్ సీఆర్‌పీసీ 160 ప్రకారం ఎమ్మెల్సీ కవితను సాక్షిగా విచారిస్తున్నట్లు ముందుగానే ఆమెకు సమాచారమిచ్చారు. దాదాపు ఏడు గంటల పాటు కొనసాగిన ఈ విచారణలో ముఖ్యంగా ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరా స్టేట్‌మెంట్‌పైనే సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అనేక ప్రశ్నల అనంతరం ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసుకున్నారు. ఇదే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన కొందరు నిందితులతో ఎమ్మెల్సీ కవితకు గల సన్నిహిత సంబంధాల గురించి, మరియు ఆమె ఉపయోగించినట్లుగా చెబుతున్న ఫోన్ల గురించి ప్రశ్నించినట్లు సమాచారం.
సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీ కవిత
ఇక సాయంత్రం 6:30 గంటల సమయంలో విచారణ ముగిసిన అనంతరం ఎమ్మెల్సీ కవిత ఇంటి బయట పెద్ద ఎత్తున గుమికూడిన బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులను ఉద్దేశించి నవ్వుతూ అభివాదం చేశారు. ఆ తర్వాత నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఇక ఆమె వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు. ఈ సందర్భంగా సీబీఐ విచారణ జరిగిన తీరుని గురించి కవిత ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. అధికారులు అడిగిన ప్రశ్నలు, వాటికి తాను ఇచ్చిన సమాధానాలను ఆమె సీఎం కేసీఆర్‌కు విపులంగా చెప్పినట్లు సమాచారం. కాగా ఈ కేసులో సెక్షన్ సీఆర్‌పీసీ 91 కింద మరో నోటీసు అందించినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణానికి సంబంధించి తన వద్ద ఏవైనా ఆధారాలుంటే తమకు అందజేయాలని కోరుతూ సీబీఐ అధికారులు ఈ నోటీసు జారీ చేసినట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE