హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ గౌరెల్లి నుంచి కొత్తగూడెం ఎన్‌హెచ్ 30 వరకు నూతనంగా మంజూరైన జాతీయ రహదారికి ఎన్‌హెచ్ నెంబర్ కేటాయించడంతో పాటు డీపీఆర్‌కు అనుమతి ఇవ్వాలంటూ ప్రధానమమంత్రి నరేంద్ర మోదీకి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖను ప్రధాన మంత్రి కార్యాలయంలో సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, నూతనంగా మంజూరైన ఈ జాతీయ రహదారి వల్ల హైదరాబాద్-వైజాగ్ పోర్టు, హైదరాబాద్-చత్తీస్‌ఘడ్ మధ్య దాదాపు 100 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గుతుందని తెలిపారు.
ఈ ప్రాజెక్టుకు డీపీఆర్‌లను ఆహ్వానించగా ఇప్పటి వరకు ఈ డీపీఆర్‌లకు అనుమతి ఇవ్వలేదని వివరించారు. దాదాపు 100 కిలోమీటర్లకు పైగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంగుండా ఈ రహదారి వెళుతుందన్నారు. ఈ రోడ్డు గిరిజన ప్రాంతాల నుంచి, రెండు జిల్లా కేంద్రాలు మహబూబాబాద్, కొత్తగూడెంగుండా వెళుతుందని వెల్లడించారు. ఈ రోడ్డు పూర్తయితే గిరిజన ప్రాంతం అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. ఈ రహదారికి వెంటనే ఎన్‌హెచ్ నెంబర్ కేటాయించి, డీపీఆర్‌లకు అనుమతులు ఇచ్చి నిధులు కేటాయించేలా సంబంధిత శాఖకు ఆదేశాలు జారీచేయాలని ప్రధాని నరేంద్ర మోదీని లేఖలో కోరారు. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ సెక్రెటరీ ఎ.గిరిధర్‌కు సైతం ఈ లేఖను అందజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ