కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ.ఆర్.టీ నంబర్.46 ప్రకారం మాత్రమే ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు ప్రతి నెల ట్యూషన్ ఫీజును వసూలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ రికగ్నైస్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) ప్రతినిధులు సెప్టెంబర్ 2, బుధవారం నాడు అధికారిక నివాసంలో భేటీ అయిన సందర్భంగా వినోద్ కుమార్ ఈ స్పష్టతనిచ్చారు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాలు ప్రతి నెల ప్రైవేట్ టీచర్లకు జీతాలు ఇవ్వాలని, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి నెల స్కూళ్లకు ట్యూషన్ ఫీజు చెల్లించి, ప్రైవేట్ టీచర్లను కాపాడుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. గత ఏప్రిల్ 20న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు 46 ప్రకారం గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్స్ ప్రతి నెలా ట్యూషన్ ఫీజు వసూలు చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్లైన్ విద్యాబోధన చేయాలని ఆయన సూచించారు. వినోద్ కుమార్ ను కలిసిన వారిలో ట్రస్మా అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, కోశాధికారి నాగేశ్వరరావు, కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ముఖ్య సలహాదారులు ఎన్. నారాయణరెడ్డి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రంగినేని పవన్ రావు, తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu