మున్సిపల్ శాఖ చేపట్టిన పనులు, నిజామాబాద్ నగర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష

CM KCR held High Level Review on Municipal Dept Works and Nizamabad City Development,CM KCR Review Meeting,Municipal Department And The Development Of Nizamabad,Nizamabad Municipal Dept Works,Nizamabad City Development,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనుల సమీక్ష, దానితో పాటు నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం అనే అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘నేడు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాల్సిన అవసరమున్నది. తెలంగాణలో పెరుగుతున్న ఆర్థిక వనరులు, సంపదకు అనుగుణంగా ప్రజావసరాలు పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రజలకు అందాల్సిన నాణ్యమైన సౌకర్యాల కోసం అందరం కలిసి పని చేయాలి. ఉమ్మడి పాలనలో కనీస వసతులు లేని సందర్భాల్లోంచి నేడు అన్ని రంగాల్లో గుణాత్మకాభివృద్ధిని తెలంగాణ సాధించింది. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, రోడ్లు, విద్య, వైద్యం తదితర మౌలిక రంగాల్లో నాణ్యమైన వసతులు ప్రజల అనుభవంలోకి వచ్చినయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గుణాత్మకంగా ప్రగతిని సాధించింది. తదనుగుణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు నేడు ఆర్థికంగా బలపడుతున్నాయి. తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి ద్వారానే ఇవన్నీ సాధ్యమైతున్నయి. తద్వారా ప్రభుత్వాలనుంచి మరింత నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారు. వారికి మరింత నాణ్యమైన ఉత్తమమైన సేవలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులమీదనే వున్నది’’ అని సీఎం అన్నారు.

ప్రభుత్వ యంత్రాంగం సమిష్టి తత్వంతో సమన్వయంతో పనిచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయని, తద్వారా మాత్రమే సమాజంలోని వ్యక్తులుగా సాధించిన ఫలితాల్లో భాగస్వామ్యం అందుకోగలమని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమం ఫలితంగా అమలులోకి వచ్చిన స్వయం పాలనలోని ప్రగతి సమిష్టి కృషికి నిదర్శనమని సీఎం తెలిపారు. స్వరాష్ట్రంలో వొక్కొక్క రంగాన్ని తీర్చిదిద్దుకుంటూ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టండంలో ప్రభుత్వ ఉద్యోగుల సమిష్టి కృషి ఇమిడి వున్నదన్నారు. సాధించినదానికి సంతృప్తిని చెంది ఆగిపోకుండా ఇంకా గొప్పగా ఆలోచించాలని సీఎం అన్నారు. ఏ రోజుకారోజు సృజనాత్మకంగా ఆలోచించిన నాడే గుణాత్మక ప్రగతిని మరింతగా ప్రజలకు చేరవేయగలుగుతామని ప్రభుత్వాధికారులకు సీఎం పునరుద్ఘాటించారు. ‘‘రోటీన్ గా అందరూ పనిచేస్తరు కానీ మరింత గొప్పగా ఎట్లా పనిచేయాలనేదే ముఖ్యం. నిన్నటి కన్నా రేపు ఎంత మెరుగ్గా పని చేయగలమని ప్రతిరోజు ఆలోచించాలె. వొక పనిని ఎంత శాస్త్రీయంగా జీవించి, రసించి, ఆలోచించి చేస్తున్నం అనేదే ముఖ్యం. అప్పుడే ఉన్నతంగా ఎదుగగలం. మూస ధోరణులను సాంప్రదాయ పద్దతులలో కాకుండా వినూత్న పద్ధతుల్లో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మార్గాలు అన్వేషించాలి. అందుకు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాల్సి వుంటుంది’’ అని సీఎం కేసీఆర్ అధికారులకు వివరించారు.

పౌర సౌకర్యాల పెంపుకోసం రోజు రోజుకూ డిమాండు పెరుగుతుందంటే, మన ప్రభుత్వం మీద ప్రజలకు పెరిగిన విశ్వాసమే అందుకు కారణమని సీఎం అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిరంతర శ్రమతో నిలబెట్టుకోవాలిన అవసరమున్నదని ఉద్యోగులతో సీఎం అన్నారు. ‘‘వొకనాడు ప్రజాదరణకు నోచుకోని ప్రభుత్వ దవాఖానలు తదితర ప్రభుత్వ వ్యవస్థలు నేడు అత్యంత ప్రజాదరణతో రద్దీగా వుంటున్నాయి. వొకనాడు తెలంగాణ నుంచి బయటకు పోయిన వలసలు నేడు రివర్సయినయి. దాదాపు 30 లక్షల మంది పక్క రాష్ట్రాలనుంచి తెలంగాణకు వలసవచ్చి బతుకుతున్న పరిస్థితి వున్నది. స్వరాష్ట్రంలో రాబడులు పెరిగి ఆర్థిక వనరులు పెరిగినాయి. పరిపాలనా సంస్కరణలతో గడప గడపకూ పాలనను తీసుకపోతున్నం. ప్రభుత్వం కృషితో అభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణలో అన్ని శాఖలల్లో పని పరిమాణం పెరిగింది. పెరిగిన అభివృద్ధిని ప్రజా ఆకాంక్షలను అందిపుచ్చుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం తమ కర్తవ్య నిర్వహణను తీర్చిదిద్దుకోవాలి. పెరిగిన అభివృద్ధికి సమాన స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాల్సి వుంటది’’ అని సీఎం స్పష్టం చేశారు. ప్రజల ప్రాథమిక అవసరాలను నిత్యావసరాలను ఎంత గొప్పగా తీర్చగలమనేదే ప్రభుత్వోద్యోగికి ప్రధాన కర్తవ్యం కావాలని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన నాటికి ఉమ్మడి పాలనలో శిధిలమై వున్న అన్ని రంగాలను తీర్చిదిద్ది నేడు వాటిని వొక ట్రాక్ మీదకు తీసుకురాగలిగామన్న సీఎం,. ప్రారంభ దశలో వున్న ఆందోళన ఇప్పడు అక్కరలేదన్నారు. అన్ని రంగాలు వాటంతంట అవి పనిచేసుకుంటూ పోయే స్థితికి తెచ్చుకున్నామన్నారు.

‘‘గతంలో వానాకాలం రెండు మూడు నెలలు మాత్రమే వుంటుండే. నేడు ఆ పరిస్థితి మారిపోయింది. నిత్యం వానలతో నిర్మాణాత్మక పనుల నిడివి కూడా తగ్గింది. వర్షాలు లేని ఆరేడు నెల్ల కాలంలోనే మనం అభివృద్ధి పనులు పూర్తి చేసుకోవాల్సి వుంటుంది. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వ యంత్రాంగం అర్థం చేసుకోవాల్సి వున్నది’’ అని తెలిపారు.

నిజామాబాద్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి:

ప్రగతి పథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరంలో అభివృద్ధి మరింత ద్విగుణీకృతమై కండ్లకు కట్టాలె అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రెండున్నర నెల్లల్లో ప్రణాళికాబద్దంగా పనులను పూర్తిచేయాలనీ, తాను పర్యటించి పనులను పరిశీలిస్తానని తెలిపారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, మున్సిపల్ శాఖ, తదితర అన్ని శాఖలు సమన్వయంతో నిజామాబాద్ అభివృద్ధి పనులను పూర్తి చేసేలా పనుల్లో నిమగ్నం కావాలని, స్థానిక ఎమ్మెల్యే గణేశ్ బిగాలను సీఎం ఆదేశించారు. నిజామాబాద్ అభివృద్ధికి నిధుల కొరత లేదని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే విడుదలైన నిధులతో పాటు నిజామాబాద్ నగరాభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులను విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రటరీకి సమావేశం నుండే సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఆదేశించారు.

‘‘ఒకనాడు గందరగోళంగా వున్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో నేడు సుందరనగరంగా మారింది. ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్టు నిజామాబాద్ ను కూడా తీర్చిదిద్దాలె. మీరంతా కలిసి ఖమ్మం టూర్ కు వెల్లండి, అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించి రండి’’ అని నిజామాబాద్ అధికారులను, ఎమ్మెల్యేను సీఎం ఆదేశించారు. నిజామాబాద్ నగరంలో రోడ్ల నిడివి ఎంత వున్నదో అంచనా వేయాలన్నారు. గ్రావెల్ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చాలని చెప్పారు. స్మశాన వాటికలు, బరీయల్ గ్రౌండ్లు ఎన్ని కావాల్సి వున్నది?, సమీకృత మార్కెట్లు ఎన్ని కావాల్సి వున్నయి?, కమ్యునిటీ హాల్లు ఎన్ని కావాలి?, డంప్ యార్డులు, వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు, అన్నీ అత్యంత వేగంగా పనులు పూర్తి చేయాలన్నారు. నిజామాబాద్ లో మెత్తం దోభీ గాట్లు, సెలూన్లను అంచనావేసి మాడ్రన్ దోభీఘాట్లను మోడ్రన్ సెలూన్లను నిర్మించాలన్నారు. నిజామాబాద్ నగరంలో గార్డెన్ల పరిస్థితిని సీఎం అడిగి తెలసుకున్నారు. పబ్లిక్ గార్డెన్లను తక్షణమే మెరుగు పరచాలన్నారు. తాను చిన్ననాడు నాటి తిలక్ గార్డెన్ లో వెళ్లి కూర్చేనేవాడినని సీఎం గుర్తు చేసుకున్నారు. తిలక్ గార్డెన్ ను పునరుద్ధరించాలన్నారు. మొక్కలను నాటడం పచ్చదనం పెంచే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను సుందరీకిరించాలని సీఎం ఆధికారులను ఆదేశించారు.

నిజామాబాద్ నగరంలో మొత్తం వున్న ప్రభుత్వ భూములెన్ని, వాటిల్లో ప్రజావసరాలకోసం వినియోగించుకోవాడనికి ఎన్ని అనువుగా వున్నాయో ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. సమీకృత కలెక్టరేట్ నిర్మాణం తర్వాత పలు శాఖలు వారి కార్యాలయాలను ఖాళీ చేస్తాయని, ఆయా శాఖల భవనాల పరిస్థితి ఏంది. వాటి స్థలాలను, కార్యాలయ భవనాలను ప్రజావసరాలకు ఏ విధంగా వినియోగించుకోవచ్చునో ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అన్నారు. నిజామాబాద్ పట్టణాభివృద్ధి కోసం అనుసరించాల్సిన పద్దతులను ఈ సందర్భంగా సీఎం అధికారులకు వివరించారు. పౌరులకు కల్పించాల్సిన సౌకర్యాలను రూపొందించుకుని వాటికోసం చేపట్టాల్సిన నిర్మాణాత్మక పనుల ప్రణాళికలను సిద్దం చేసుకోవాలన్నారు. దాంతో పాటు నగరాన్ని సుందరీకరించే అంశాలేమిటో పరిశీలించి అందుకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అలంకారాలేమిటి అనే ప్రణాళికలను సిద్దం చేసుకోవాల్సి వున్నదని సీఎం తెలిపారు. “నేను రెండు నెల్లల్లో నిజామాబాద్ వస్త. మీరు చేసిన పనులను పరిశీలిస్త. అందమైన నిజామాబాద్ ను తీర్చిదిద్దాలె’’ అని సీఎం అన్నారు.

రాష్ట్రంలో మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను ఆ శాఖ మంత్రి కేటీఆర్ సీఎంకు వివరించారు. దేశంలోనే ఆదర్శవంతమైన పట్టణాలను తీర్చిదిద్దడంలో మున్సిపల్ శాఖ కృషిని వివరించారు. నిజామాబాద్ నగరంలో ఆడిటోరియం నిర్మాణానికి సంబంధించిన వివరాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. నిజామాబాద్ నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్సీ కవిత సీఎంను అభ్యర్థించారు. నగరంలో బస్టాండ్ నిర్మాణానికి విశాలమైన స్థలం, పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణ నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత సీఎంకు వివరించారు. హజ్ భవన్ నిర్మాణం చేపట్టాలని సీఎంను కోరారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, వెంకటర్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్, జీవన్ రెడ్డి, రోహిత్ రెడ్డి, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, డైరక్టర్ సత్యనారాయణ, నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ చిత్ర, నిజామాబాద్ జిల్లా పంచాయితీ రాజ్, రోడ్లు భవనాలు, ఇరిగేషన్, రెవిన్యూ, పబ్లిక్ హెల్త్, తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − seven =