నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించబోతుంది. అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల్లో ఊహకందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రేవంత్ సర్కార్ ముందుకు దూసుకెళ్తుంది.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అవుతుండటంతో.. నవంబర్ 14 వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు 26 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణపై ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలు ఫోకస్ చేస్తూ.. ప్రభుత్వ విజన్ ప్రజలకు వివరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. దాదాపు 18 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ చేయడంతో పాటు, మహిళా సంఘాలకు 20 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందచేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. డిసెంబర్ 9న హైదరాబాద్ హైదరాబాద్‌లో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు, క్రాకర్స్ ప్రదర్శన నిర్వహించడానికి తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే.. పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు..ఆరోజు నియామక పత్రాలు అందజేయనున్నారు.
అంతేకాకుండా..పలు కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటు కోసం ఒప్పందాలు కుదుర్చుడం, స్పోర్ట్ యూనివర్సిటీకి ఫౌండేషన్, 16 నర్సింగ్ కళాశాలలు, 28 పారా మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపనలు కూడా జరుగనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు వివరించారు.