కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మే మొదటి వారంలో రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం వెల్లడించారు. వరంగల్‌లో జరిగే బహిరంగ సభతో ఆయన తన పర్యటనను ప్రారంభించి రెండో రోజు పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉన్న వరంగల్‌లో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని నాయకులు ఏప్రిల్ 4న న్యూఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు రాహుల్ గాంధీని తెలంగాణ పర్యటన చేయాలని అభ్యర్థించగా ఆయన వారి ఆహ్వానాన్ని అంగీకరించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు తెలంగాణలో రైతులు, దళితులు, నిరుద్యోగ యువకులు తదితర సమస్యలపై బహిరంగ సభలను విజయవంతం చేశారు. వరి కొనుగోళ్లపై టీఆర్‌ఎస్, బీజేపీ మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో రైతుల ఆందోళనలను పరిష్కరించేందుకు ఇదే సరైన సమయమని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉన్న వరంగల్‌లో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ లో పార్టీ ముఖ్య నేతలతో రాష్ట్ర ఇంచార్జి మాణికం ఠాగూర్ కీలక సమావేశం నిర్వహించారు. గాంధీభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ సభ్యత్వ కార్యక్రమం, సభ్యులకు బీమా సౌకర్యం, రాహుల్‌గాంధీ పర్యటన తదితర అంశాలపై కీలక చర్చలు జరిగాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ