దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రుతుపవనాలు ముగియగా, కొన్నిచోట్ల అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ 4 నుంచి పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ చెబుతున్న దాని ప్రకారం గల్ఫ్ ఆఫ్ మన్నార్, తూర్పు, మధ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఇది యూపీ, బీహార్, ఎన్‌సీఆర్‌లపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఈ ప్రాంతాల్లోని అక్టోబర్ 5,6 తేదీలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
ఈ క్రమంలో మత్స్యకారులు ఈశాన్య బంగాళాఖాతం వైపు చేపల వేట కోసం వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వచ్చే 6 నుంచి 7 రోజుల్లో మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపింది. దీంతో పాటు కేరళ, మేఘాలయ, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్, మిజోరాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, త్రిపురలలో అక్టోబర్ 4న భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.
అంతేకాదు తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి,నారాయణపేట,మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
మరోవైపు ఏపీలో కూడా మూడు రోజులు వానలు ఉంటాయని ఐఎండీ అధికారులు తెలిపారు. కర్నూలు, ప్రకాశం, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో పాటు అల్లూరి, కోనసీమ, ఉభయ గోదావరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో కూడా ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఇక ఢిల్లీలో 2024 రుతుపవనాల సీజన్ 61% వర్షపాతంతో ముగిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల నిష్క్రమణ తర్వాత న్యూ ఢిల్లీలో ఉష్ణోగ్రత పెరుగుతుందని వెల్లడించారు.