ఆర్థిక క్రమశిక్షణతోనే రాష్ట్రం అభివృద్ధి – ఆర్థికమంత్రి హరీశ్ రావు

CFO Conclave 2019, CFO Conclave 2019 In Hyderabad, Mango News Telugu, Minister Harish Rao, Minister Harish Rao Political Updates, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

ఆర్థిక క్రమశిక్షణతోనే రాష్ట్రమైన, ఓ కంపెనీ అయినా అభివృద్ధి సాధిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు చెప్పారు. దుబారాను తగ్గించడం ఆదాయం సృష్టించడంతో సమానమని అన్నారు. డిసెంబర్ 5, గురువారం నాడు ఆయన ఐటీసీ కాకతీయ హోటల్ లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన సీఎఫ్‌వో కన్‌క్లేవ్‌-2019 కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీలకు చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ( సీఎఫ్‌వో) పాత్ర కీలకమని చెప్పారు. తాను కూడా రాష్ట్రానికి సీఎఫ్‌వో లాంటి వాడినేనని ఉదహరించారు. కంపెనీ ఎదుగదల కోసమే సీఎఫ్‌వోలు పని చేయాలన్నారు. ఇందు కోసం కంపెనీ యాజమాన్యం మెప్పు కోసం కాకుండా కంపెనీ అభివృద్ధి కోసమే నిర్ణయాలుండాలని హరీష్ రావు చెప్పారు. ఆర్థిక పరమైన విషయాల్లో కంపెనీని సరైన దిశగా నడిపించాల్సిన బాధ్యత సీఎఫ్‌వో ల మీదే ఉంటుందన్న ఆయన కొన్ని సార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోడానికి కూడా వెనకాడకూడదన్నారు.

ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు నిధులు వేగంగా ఖర్చు చేసి ప్రాజెక్టులు నిర్మించాలన్న తపన ఉండేదని, ఇప్పుడు ఆర్థిక మంత్రిగా తన పాత్ర మారిందని వివరించారు. దేశంలోను, రాష్ట్రంలోను జీడీపీ తగ్గిపోతున్న తరుణంలో నిధుల వినియోగం, ఆర్థిక వనరుల సమకూర్పు కీలకమైన విషయాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు వెన్నుదన్నుగా నిలిచిందన్న మంత్రి హరీశ్ రావు, అన్ని విధాల పారిశ్రామిక రంగానికి అండగా ఉంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వం కృషి కారణంగా గత ఐదేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం అవార్డులు సాధిస్తున్నామన్నారు. టీఎస్ఐపాస్ తో పారిశ్రామిక రంగాన్ని ఆకట్టుకోగలిగామని చెప్పారు. దేశంలోనే పెద్దదైన మెగా టెక్స్ టైల్ పార్కును, ఫార్మా సిటీ, మెడికల్ డివైస్ పార్కు వంటి వాటిని త్వరలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్పోరేట్ రంగానికి కేంద్రం పన్ను తగ్గించడం వల్ల కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమం అయిందన్నారు. కొత్తగా బ్యాంకులు తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వాలన్న నిబంధన కారణంగా కొత్త పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలకు ఉపయోగకరమని చెప్పారు. ఆయా కంపెనీలు డిమాండ్ లేని కారణంగా ఉత్పత్తుల సప్లయ్ తగ్గిందని ఆందోళన చెందుతున్నారని, కాని ఇందుకు కారణం కొత్త పరిశ్రమలు రాకపోవడమే ప్రధాన కారణమని చెప్పారు.

నిరుద్యోగం వల్ల కొనుగోలు శక్తి లేకపోవడం, ఈ కారణంగా డిమాండ్ తగ్గిపోయిందని విశ్లేషించారు. కొత్త కంపెనీలు స్థాపించి నిరుద్యోగాన్ని నివారిస్తే, వ్యక్తుల కొనుగోలు శక్తి పెరిగి డిమాండ్ కూడా పెరుగుతుందని మంత్రి హరీశ్ రావు సూత్రీకరించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అన్ని విధాలుగా ప్రభుత్వ సహకారం ఉంటుందన్న ఆయన ఇన్సెంటివ్స్ సైతం త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. ఎంతో అనుభవం ఉన్న పారిశ్రామిక వేత్తలు ఆర్థిక మందగమనాన్ని తట్టుకునేందుకు ఏం చేయాలి అన్న విషయాలపై కొత్త ఆలోచనలతో ముందుకు రావాలన్నారు. నిత్యం కంపెనీ కార్యకలాపాలతో తీరిక లేకుండా ఉండే వారంతా యోగా, ప్రాణాయామం చేయాలని, దీని వల్ల మానసిక ఒత్తిడి దరి చేరకుండా చూసుకోవచ్చని మంత్రి హరీశ్ రావు సూచించారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − nine =