ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద గరిష్టంగా 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. దీనికి ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉండటంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులు త్వరపడాలని అధికారులు అంటున్నారు. ఈ పథకం ద్వారా నిరుద్యోగులలో ఆర్థిక స్వాతంత్య్రం, స్వయం ఉపాధి అవకాశాలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంటోంది.
రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేయాలి అంటే వాళ్లు.. తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి. వ్యవసాయేతర ప్రాజెక్టులకు 21 నుంచి 55 సంవత్సరాలు. వ్యవసాయం మరియు సంబంధిత రంగాలకు 21 నుంచి 60 సంవత్సరాలు వయస్సు వారంతా దీనికి అర్హులే. గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి వీరి ఆదాయం 1,50వేల రూపాయలు ఉండాలి అదే పట్టణ ప్రాంతాల్లో అయితే సంవత్సర ఆదాయం 2 లక్షల వరకూ ఉండాలి.
50వేలు రూపాయల వరకు తీసుకున్నవారికి 100% రాయితీ ఉంటుంది. అదే 50,001 రూపాయల నుంచి 1 లక్ష రూపాయలు పొందితే వారిక 90% రాయితీ ఉంటుంది. అలాగే 1,00,001 నుంచి 2 లక్షలు పొందితే 80% రాయితీ ఉంటుంది. అదే 2 లక్షలు నుంచి రూ..4 లక్షలు తీసుకుంటే.. రాయితీ శాతాన్ని తగ్గుతూ, మిగిలిన మొత్తం బ్యాంకు రుణం లేదా లబ్ధిదారుడి సొంత భాగస్వామ్యంతో తీర్చాలి.
రాజీవ్ యువ వికాసం పథకం కోసం.. ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెలంగాణ ఏర్పడిన తర్వాత జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం , ట్రాన్స్‌పోర్ట్ రంగ పథకాలకు డ్రైవింగ్ లైసెన్స్ , వ్యవసాయ పథకాలకు పట్టాదార్ పాస్‌బుక్ , వికలాంగులకు సదరమ్ ధ్రువీకరణ పత్రం ఉండాలి.
అధికారిక వెబ్‌సైట్ అయిన tgobmms.cgg.gov.in లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఇది జిల్లా స్థాయి కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.లబ్ధిదారులకు తెలంగాణ ఆవిర్భావం రోజయిన జూన్ 2, 2025 నుంచి ఆర్థిక సహాయం అందజేస్తారు.