సాయుధ రైతాంగాల పోరాటాల నుంచి మొదలు పెడితే కరెంట్ ధరల పెంపు ఆందోళనల సందర్భంగా ప్రాణాలు పోయినా లెక్క చేయని వీరులున్న పార్టీలు. నలుగురు ఉంటే చాలు.. అన్యాయంపై నలుదిక్కులా కన్నెర్ర చేసే పార్టీలు.. దేనికీ వెరవకుండా.. ఎవరికీ భయపడకుండా.. సామాన్య ప్రజల పక్షాన నిలిచిన .. నిలుస్తూనే ఉన్న పార్టీలు. అవే కమ్యూనిస్టు పార్టీలు. కానీ.. వాటి ఎజెండా మారిందా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారం కోసం.. ఒకటీ రెండూ సీట్ల కోసం .. ఇతర పార్టీల ముందు చేచాస్తున్న పరిస్థితి. అవి పట్టించుకోకున్నా నిరీక్షిస్తున్న దుస్థితి .. ఈ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందని ఆ పార్టీల అభిమానులు వేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగాలు.. పెద్దపార్టీల నేతలపై కన్నెర్ర జేసే స్థాయి నుంచి సాగిల పడేవరకూ రావడం వెనుక ఆంతర్యమేమిటో అంతుపట్టడం లేదని ఆందోళన చెందుతున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం కొద్దిరోజులు నిరీక్షించిన ఆ పార్టీలు గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్‌వైపు దృష్టి మళ్లించాయి. తొలుత స్వాగతం పలికిన కాంగ్రెస్ ఇప్పటి వరకూ కేటాయించే సీట్లపై తగిన స్పష్టత నివ్వకపోవడంతో ఇంతకీ ఈ పార్టీలు పోటీచేస్తాయా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయంటే ఆపార్టీల పరిస్థితుల్ని అంచనా వేసుకోవచ్చు. గత ఆగస్టులోనే కనీసం ఆపార్టీలను సంప్రదించకుండా బీఆర్‌ఎస్ తొలిజాబితాను ప్రకటించడంతో కంగుతున్న కమ్యూనిస్టు పార్టీల నేతలు.. అనంతరం కాంగ్రెస్ వైపు దారి మళ్లించారు. కాంగ్రెస్‌కు సైతం గడువులు దాటుతున్నా కోరుకున్న సీట్లపై తగిన స్పష్టత రాలేదు. నామినేషన్ల సమయం దగ్గర పడుతున్నందున ఉభయకమ్యూనిస్టులు ఉమ్మడి పోరుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు జరగనున్న సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ అంశంపై స్పష్టత రానుంది. సీపీఎం 15 నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ్రప్రకటించనున్నట్లు చెబుతున్నారు. అలాగే సీపీఐ సైతం ఎక్కడెక్కడ పోటీ చేయనుందో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
రెండు పార్టీలూ తమకు చెరో ఐదు చొప్పున మొత్తం పది అసెంబ్లీ స్థానాల్ని కోరగా తొలుత కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసినట్లు కమ్యూనిస్టు పారీల్ట నేతలు పేర్కొన్నారు.అనంతరం మూడేసి స్థానాలే ఇవ్వగలమని చెప్పారు. అంతిమంగా చెరో రెండు సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. వాటిపైనా స్పష్టత నివ్వకుండా నాన్చుతుండటంతో తమ దారి తాము చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సీపీఐ కొత్తగూడెం, మునుగోడు కోరగా కొత్తగూడెం బదులు చెన్నూరు, సీపీఎం మిర్యాలగూడ, భద్రాచలం/పాలేరు కోరగా, మిర్యాలగూడతోపాటు వైరా ఇచ్చేందుకు ప్రతిపాదించినట్లు ఆ పార్టీల నేతలు తెలిపారు. అంతిమంగా వైరా ఇవ్వబోమని మొండికేసినట్లు తెలిసింది. మరోవైపు సీపీఐకి కేటాయించే స్థానాలపైనా కాంగ్రెస్ నుంచి స్పందన లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తోనైనా పొత్తు పొడుస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. పొత్తు కుదరని పక్షంలో రెండు లెఫ్ట్‌పార్టీలూ ఉమ్మడిగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈపార్టీలు అసలు పోటీ చేస్తాయా ? లేక విరమించుకుంటాయా అనే సందేహాలు సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఒంటిరిగానైనా పోటీకి సిద్దమని, ఇస్తామన్న సీట్లు కాంగ్రెస్ ఇవ్వకపోవడం మంచిది కాదని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ