రేపటి నుంచి రైతు భరోసా డబ్బులు

Rythu Bharosa Money From Tomorrow

తెలంగాణ రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న.. రైతు భరోసా పథకం రేపటి నుంచి అమలు కాబోతోంది. జిల్లాలో రైతు భరోసా చెల్లించే సాగుయోగ్యమైన భూముల లెక్కలు తేలడంతో.. జనవరి 26 నుంచి రైతుల అకౌంట్లలో తెలంగాణ ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రూ.6 వేల చొప్పున జమ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తాము అధికారంలోకి వస్తే రైతులకు ఇస్తున్న రైతుబంధు పథకం స్థానంలో.. రైతు భరోసా కింద ప్రతీ ఏడాది ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి.. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కూడా ఏర్పడింది. అయితే ఏడాది గడిచినా సరే రైతు భరోసా అమలు కాకపోవడంతో ఇటు రైతాంగం, అటు విపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి.

దీంతో రేవంత్ సర్కార్ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి.. రైతు భరోసా ఏయే భూములకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి. ఎన్నెకరాలకు ఇవ్వాలనే అంశాలపై చర్చలు జరిపింది. జిల్లాల వారీగా సదస్సులను నిర్వహించి రైతుల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించింది.అయితే దీనిపై విమర్శలు ఎక్కువవుతాయని భావించిన తెలంగాణ సర్కార్.. సాగు యోగ్యమైన భూములన్నింటికి కూడా రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సాగు యోగ్యమైన భూముల్లో పంటలు వేసినా, వేయకపోయినా రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సాగు భూములు కానివాటి లెక్క తేల్చిన తెలంగాణ సర్కార్..దీనిపై తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.

సాగు యోగ్యం కాని 3 లక్షల ఎకరాలు భూమిలో.. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, గుట్టలు, కొండలు, ప్రభుత్వం సేకరించిన భూముల వివరాలను ప్రభుత్వం సేకరించింది. వాటి సర్వే నంబర్లను కూడా అధికారులు బ్లాక్‌ చేశారు. రైతు భరోసా కింద సాగు యోగ్యమైన వ్యవసాయ భూమికి ప్రతీ ఏడాది రూ.12 వేలు చెల్లిస్తుంది. సాగు యోగ్యమైన భూమిలో పంటలు వేసినా వేయకపోయినా కూడా రైతు భరోసా రైతుల అకౌంట్లలో జమ చేస్తారు. ధరణి, భూమాత పోర్టల్‌లో నమోదైన అకౌంట్ల ఆధారంగా చెల్లిస్తారు.