జీహెఛ్ఎంసీ మరియు కంటోన్మెంట్ ఏరియాలలో ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం బి.ఆర్.కె.ఆర్. భవన్‌లో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి, జీహెఛ్ఎంసీ కమిషనర్, కంటోన్మెంట్ బోర్డు అధికారులు మరియు వైద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆగస్టు 23 తేదీ నుండి 10 నుంచి 15 రోజుల పాటు జీహెఛ్ఎంసీలోని అన్ని 4846 కాలనీలు, మురికివాడలు, ఇతర ప్రాంతాలు మరియు కంటోన్మెంట్ జోన్‌లోని 360 ప్రాంతాలలో కొనసాగుతుందని అన్నారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ యొక్క ప్రధాన లక్ష్యం హైదరాబాద్‌ను 100% కోవిడ్ వ్యాక్సిన్స్ వేసిన నగరంగా మార్చడం అని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.
మొత్తం 175 మొబైల్ వ్యాక్సిన్ వాహనాలను వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం ఉపయోగిస్తారని, జీహెఛ్ఎంసీ ప్రాంతంలో 150, కంటోన్మెంట్ ప్రాంతాల్లో 25 వాహనాలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రతి వాహనంలో ఇద్దరు వ్యాక్సిన్ వేసే సిబ్బంది మరియు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారని చెప్పారు. ప్రతి కాలనీలో ఇద్దరు వ్యక్తులతో కూడిన మొబిలైజేషన్ టీమ్‌లు వ్యాక్సిన్ డోసులను తీసుకోని వ్యక్తులను ముందుగానే గుర్తించి ఇంటింటికీ వ్యాక్సినేషన్ చేయిస్తారని అన్నారు. టీమ్ ముందుగానే వ్యాక్సినేషన్ తేదీ మరియు సమయాన్ని ప్రజలకు తెలియజేస్తారన్నారు. వ్యాక్సిన్స్ వేసిన తర్వాత వ్యాక్సిన్ వేసిన ప్రతి ఇంటి తలుపుల మీద స్టిక్కర్ అతికించబడుతుందని అన్నారు.
జీహెఛ్ఎంసీ మరియు కంటోన్మెంట్ ప్రాంతాల్లోని అన్ని గృహలకు సరిపోయేంత తగిన పరిమాణంలో వ్యాక్సిన్స్ అందుబాటులో ఉంచబడతాయని, ప్రతి కాలనీలో ప్రజలకు ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ పై ఆడియో ప్రకటనతో పాటు బ్యానర్లు, ఆటో స్టిక్కర్లతో అవగాహన కల్పిస్తామని తెలిపారు. కాలనీలు, మురికివాడల్లో 100% వ్యాక్సిన్స్ వేయడానికి ప్రోత్సహించడానికి మరియు చైతన్యపరచడానికి కాలనీ ఆఫీస్ బేరర్ల సమక్షంలో బ్యానర్ ను విడుదల చేసే వేడుకను కాలనీలో నిర్వహిస్తారని చెప్పారు. 100% వ్యాక్సినేషన్ విజయవంతంగా పూర్తి చేసిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కాలనీలకు జీహెఛ్ఎంసీ కమిషనర్ ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో వ్యాక్సిన్ వేయించుకునే అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెఛ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ సీఈఓ అజిత్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్ రావు, ఓఎస్డి టు సిఎం డా.గంగాధర్, తదితర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ