గాంధీభవన్‌లో డిసెంబర్ 26, గురువారం నాడు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు మరియు 28న తలపెట్టిన సేవ్ ఇండియా -సేవ్ రాజ్యాంగం ర్యాలీపై కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. అయితే ఈ కోర్ కమిటీ సమావేశం వాడివేడిగా జరిగినట్టుగా తెలుస్తుంది. కోర్ కమిటీలో సభ్యులు కానివారిని కూడా ఈ సమావేశానికి పిలిచారని టి-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు వాకౌట్ చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికలపై తాను చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేసినా కూడా, పార్టీనుంచి ఏ నాయకుడు కూడా స్పందించలేదని ఉత్తమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై షబ్బీర్ అలీ స్పందిస్తూ, టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టకపోవడం తప్పేనని, పార్టీలో నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారని వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలకు భయపడడం లేదని, రిజర్వేషన్ ప్రకటనకు నామినేషన్‌కు మధ్య సమయం ఇవ్వాలని కోరుతున్నామే తప్ప ఎన్నికలను వాయిదా వేయమని అనడం లేదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు ఒక్క రోజు ముందర రిజర్వేషన్లు ప్రకటించి, ఎటువంటి గడువు ఇవ్వకుండా రెండు రోజుల్లో నామినేషన్లను వెయ్యమనడమే తమకు అభ్యంతరకరమన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఎవరూ భయపడి మాట్లాడటం లేదని, అయినా ఒక ఎన్నికల్లో కూడా గెలవనివారు సైతం తన గురించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఓటర్ల జాబితా పూర్తికాకుండా ఎన్నికల షెడ్యూల్ ఎలా ఇస్తారని? ఉత్తమ్ ప్రశ్నించారు. అలాగే రిజర్వేషన్ల ప్రకటనతో తమకు సంబంధం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
[subscribe]



