వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. తెలంగాణలో అత్యంత వివాదాస్పదమైన నేత ఎవరంటే.. అది ఇతనే. నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కొని వార్తల్లోకి ఎక్కుతుంటారు. రాజకీయంగా బలమైన నేత అయినప్పటికీ నిత్యం వివాదాలు రాజయ్యను చుట్టుముడుతుంటాయి. ఇటీవల సర్పంచ్ నవ్వను వేధింపులకు గురి చేయడంతో రాజయ్య ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా సెన్సేషనల్ అయిపోయారు. స్వయంగా నవ్య ఇంటికి వెళ్లి క్షమాపణలు కూడా చెప్పారు. ఆ తర్వాత నవ్య పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చి.. రాజయ్యపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో రాజయ్యపై నవ్య చేసిన కామెంట్లు మారుమ్రోగిపోయాయి.
ఇక తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వంలో మొదటి ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి రాజయ్య ఓ వెలుగు వెలిగారు. కానీ అప్పుడు కూడా ఇటువంటి వివాదాల్లో ఇరుక్కోవడంతో.. కేసీఆర్ ఆయనపై వేటు వేయక తప్పలేదు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగుతూ కూడా.. రాజయ్య అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. ఈ వివాదాల పట్ల ఎప్పటికప్పుడు అధిష్టానం రాజయ్యను హెచ్చరిస్తూనే వచ్చింది. కానీ ఆ తర్వాత కూడా రాజయ్య తన తీరును మార్చుకోలేదు. చివరికి ఎమ్మెల్యే టికెట్ కోల్పోయే స్థాయికి వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ.. రాజయ్యకు టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధిష్టానం నిరాకరించింది.
అయితే ఈసారి టికెట్ దక్కకపోవడంతో రాజయ్య అలకబూనారు. అధిష్టానం పట్ల గుర్రుగా ఉన్నారు. పలుమార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అటు అధిష్టానం కూడా రాజయ్యను కూల్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. చివరికి రాజయ్యను బుజ్జగించి కీలక బాధ్యతలు అప్పగించింది. రైతు బంధు చైర్మన్ పదవిని రాజయ్యకు కట్టబెట్టింది. అయితే కొత్త పదవి చేపట్టినప్పటి నుంచి రాజయ్య.. టికెట్ మాట ఎత్తలేదు. ఇక రాజయ్య శాంతించారని అంతా భావించారు.
సరిగ్గా అదే సమయంలో తాటికొండ రాజయ్య సంచలన బాంబు పేల్చారు. తాను ఇప్పటికీ టికెట్ దక్కుతుందనే ఆశతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. గ్రౌండ్ లెవల్‌లో సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ప్రజలు తనను ఎమ్మెల్యేగా కానసాగాలని కోరుకుంటున్నారని చెప్పారు. సర్వేలు, నివేదికలు కూడా అదే చెబుతున్నాయని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో అధిష్టానం సర్వే నిర్వహించి ప్రజాభిప్రాయం తెలుసుకోవలన్నారు. గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితిని చూసి.. అధిష్టానం చివర్లో అయినా టికెట్ తనకు ఇస్తుందన్న నమ్మకం ఉందని రాజయ్య వ్యాఖ్యానించారు. దీంతో రాజయ్యకు టికెట్‌పైన ఆశ ఇంకా పోలేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ముందు ముందు ఇంకా ఎన్ని బాంబులు పేలుస్తారేమేనని మాట్లాడుకుంటున్నారు.