రాజ‌ధాని “మూడు” మారిందా?

Has the capital changed to three,Has the capital changed,capital changed to three,Mango News,Mango News Telugu,Andhrapradesh, AP, AP Capital, AP Politics, CM Jagan,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Andhra Pradesh Capital Latest News,Andhra Pradesh Capital Latest Updates,Andhra Pradesh Capital Live News
Andhrapradesh

హైద‌రాబాద్ రాజ‌ధానిగా దేశంలోనే విఖ్యాత గుర్తింపు పొందిన ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్.. విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనంత‌రం రాజ‌ధాని లేని రాష్ట్రంగా ప్ర‌చారంలో ఉంది. ఏకైక రాజ‌ధాని అమ‌రావ‌తి నుంచి మూడు రాజ‌ధానుల రాష్ట్రంగా.. ప్ర‌స్తుతం విశాఖే ఏకైక రాజ‌ధాని అన్న‌ట్లుగా ప్ర‌భుత్వ పెద్ద‌లు వ్యాఖ్య‌లు ఉన్నాయి. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెబుతూనే.. విశాఖ ప్ర‌స్తావ‌న త‌ప్పా.. అమ‌రావ‌తి, క‌ర్నూలు ప్ర‌స్తావ‌న‌లు రావ‌డం లేదు. ఇందుకు శాస‌న‌, చ‌ట్ట‌ప‌ర‌మైన ఇబ్బందులు కార‌ణంగా క‌నిపిస్తున్నాయి.

అప్పుడు.. ఇప్పుడూ..

రెండేళ్ల క్రితం కూడా స‌రిగ్గా అక్టోబ‌ర్ కు ముందు విశాఖ‌కు ఏపీ రాజ‌ధానిని మార్చ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అందుకు కార్యాయాలను సిద్ధం చేస్తున్న‌ట్లు మంత్రులే చెప్పారు. దాంతో పాటు.. క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కూడా మార్గం సుగ‌మం అవుతోంద‌ని వెల్ల‌డించారు. అయితే.. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ త‌ప్పా.. మూడు రాజ‌ధానుల ప్ర‌స్తావ‌న లేకుండా మంత్రుల వ్యాఖ్య‌లు ఉంటున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో స్వ‌యంగా జ‌గ‌నే 2019 డిసెంబర్ 17 నాడు అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల ప్రకటనల చేశారు. అందుకు దక్షిణాఫ్రికాను ఉదహరించారు. పాలనా వికేంద్రీకరణ తమ విధానమని చెప్పారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్ గా ప్రతిపాదిస్తూ అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుందని తెలిపారు. సీఎం ప్రకటనకు అనుగుణంగా 2020 జనవరిలో శాసనసభ ప్రత్యేక సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఆర్డీయే రద్దు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులు ఆమోదించారు. శాసనమండలిలో హైడ్రామా జరగడంతో బిల్లు పెండింగులో పడింది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో మళ్లీ అసెంబ్లీ ఆమోదంతో మండలి అభిప్రాయంతో సంబంధం లేకుండానే చట్టంగా రూపొందే అవకాశాన్ని పొందారు. గవర్నర్ ఆమోదంతో 2020 సెప్టెంబర్‌లో మూడు రాజధానుల చట్టం రూపొందించారు. అప్ప‌టి నుంచీ ఏపీకి త్వ‌ర‌లోనే మూడు రాజ‌ధానులు అన్న ప్ర‌చారం జ‌రుగగా.. కొంత కాలంగా అందుకు విరుద్ధంగా ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

న్యాయ‌ప‌ర‌మైన చిక్కులే కార‌ణ‌మా?

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని భూములిచ్చిన రైతాంగం చేపట్టిన ఉద్యమానికి పోటీగా మూడు రాజధానులు ఉండాల్సిందేనని వైసీపీ ఆందోళనలు కూడా చేసింది. అయితే.. మూడు రాజ‌ధానుల‌పై న్యాయపరమైన చిక్కులు ఏపీ ప్రభుత్వానికి అడ్డంకిగా మారాయి. రాజ‌ధానుల అంశంపై ఏపీ హైకోర్టులో తుది తీర్పు వెలువడేందుకు ముందుగానే 2022 మార్చిలో, తాము చేసిన రెండు చట్టాలను ఉపసంహరించుకుంది. ఏపీ సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ పేరుతో చేసిన మూడు రాజధానుల చట్టాన్ని స‌ర్కారు వెనక్కి తీసుకుంది. ఆ సంద‌ర్భంలో కూడా మ‌రింత ప‌క్కాగా, ప‌టిష్టంగా మూడు రాజ‌ధానుల చ‌ట్టాన్ని తీసుకొస్తామ‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు చెప్పుకొచ్చారు. కానీ.. ఆ దిశ‌గా ఇప్ప‌టి వ‌ర‌కూ ఎక్క‌డా కార్య‌చ‌ర‌ణ ప్రారంభించిన దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. అంతేకాకుండా ఒక‌టే రాజ‌ధాని అది విశాఖే అన్న‌ట్లుగా ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

చ‌ట్టాల ర‌ద్దు అనంత‌రం..

మూడు రాజధానుల చట్టాన్ని స‌ర్కారు వెనక్కి తీసుకున్న‌ప్ప‌టి నుంచీ విశాఖ ఒక్కటే రాజధాని అని మంత్రులు చెబుతూ వ‌స్తున్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఓ బహిరంగసభలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆ త‌ర్వాత పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా అదే విధంగా వ్యాఖ్యానించారు. విశాఖలో జ‌రిగిన‌ పెట్టుబడుల సదస్సు సన్నాహాక సమావేశంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి కూడా త్వరలోనే విశాఖపట్నం రాజధాని అవుతుందని చెప్పారు. అనంత‌రం బెంగళూరులో జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరో అడుగు ముందుకేసి మూడు రాజధానులు అనేది ‘మిస్ కమ్యూనికేషన్’ అని చెప్పారు.

“మూడు రాజధానులు అనేది సమాచార లోపం. పాలన విశాఖ నుంచే జరుగుతుంది. పాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేశామంటే విభజిత ఆంధ్రప్రదేశ్‌లో విశాఖలో సదుపాయాలున్న ప్రాంతమే కాకుండా అభివృద్ధికి అవకాశం ఉన్న నగరం. కాబట్టి పోర్ట్ సిటీగా, కాస్మోపాలిటన్ నగరంగా ఉండడం, వాతావరణం అన్నీ కలిసివస్తాయి. ఇతర నగరాలు రాజధాని అని కాదు. కర్ణాటకలో గుల్బర్గా, ధార్వాడ్‌లో హైకోర్టు బెంచి ఉన్నట్టే. అలా కర్నూలు ఎంపిక చేసుకోవడానికి వందేళ్ల నాటి కారణాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందే 1937లో పాలనా రాజధాని ఒక ప్రాంతంలో ఉంటే హైకోర్టు మరో ప్రాంతంలో డాలని శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. అందులో భాగంగా హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించాము” అంటూ ఆయన సమాధానమిచ్చారు.

తాజాగా ఈ ద‌స‌రాకే విశాఖకు రాజ‌ధాని షిప్ట్ అవుతుంద‌ని చెబుతున్న ప్ర‌భుత్వ పెద్ద‌లు.. ఆ దిశ‌గా కార్యాచ‌ర‌ణ జ‌రుగుతుంద‌ని కూడా పేర్కొంటున్నాయి. అయితే.. విశాఖ‌లోనే అన్ని కార్య‌క‌లాపాలు చేప‌డ‌తారా.. గ‌తంలో పేర్కొన్న‌ట్లుగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్ గా ప్రతిపాదిస్తూ అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుందా అనే దానిపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో రాజ‌ధానిపై ప్ర‌భుత్వం మూడు మారింద‌ని, మున్ముందు విశాఖే ఏకైక రాజ‌ధానిగా కొన‌సాగుతుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =